మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడగింపు

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4వ తేదీ నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. ఈ మేరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

రెండో దఫా లాక్‌డౌన్‌ గడువు మే 3తో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.ఇక శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు.

దేశ వ్యాప్తంగా విమానాలు, రైళ్లు, మెట్రో సర్వీసులు, అంతర్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు శిక్షణ, కోచింగ్‌ సంస్థలపై నిషేధం విధించారు. రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. సైకిళ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు, కటింగ్‌ షాపులపై నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి, మదింపు ఉంటుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.