400 రైళ్లు నడిపేందుకు రైల్వేలు సిద్ధం 

ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను, యాత్రికులను, విద్యార్ధులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిన కొద్దీ సేపటికే రోజుకు 400 రైళ్లు నడిపించేందుకు రైల్వేశాఖ సిద్ధం చేసింది. 

 టికెట్‌ ఎంత అన్నది నిర్ణయించడానికి రైల్వే శాఖ కసరత్తులు చేస్తోంది. అయితే రైళ్లలో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా సామజిక దూరం పాటించేలా నిబంధనలు పాటించాలని సూచించింది. 

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన భక్తులు, పర్యాటకులు తదితరులకూ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీసిన విషయం తెలిసిందే.

దీంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తమవారిని స్వస్థలాలకు తరలించడానికి, రైళ్లను నడపాలని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో, కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకరిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు. టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది.  ఇప్పటికే తెలంగాణా నుంచి 12వందల మందితో ప్రత్యేక రైలు జార్ఖండ్ బయలుదేరింది. మరో రైలు కేరళ నుంచి ఒడిశాకు వెళ్లనుంది.