దూర‌దర్శన్‌లో 7.7 కోట్ల మంది చూస్తున్న రామాయణ్ 

లాక్‌డౌన్‌లో ప్రజలను ఎంటర్‌‌టైన్‌ చేసేందుకు దూర‌దర్శన్‌ ప్రసారం చేస్తున్న రామానంద్‌ సాగర్‌‌  రామాయణ్   రికార్డుల మోత మోగిస్తోంది. 33 సంత్సరాలైనా ప్రజల నుంచి షోకు ఉన్న ఆదరణ తగ్గలేదని దూర‌దర్శన్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

1980, 90లలో అమితంగా ఆకట్టుకున్న రామాయణ్‌, మహాభారత్, శ్రీ కృష్ణ వంటి సీరియళ్లను దూరదర్శన్‌ తిరిగి ప్రసారం చేస్తుంది. పునఃప్రసారంలో భాగంగా ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన రామాయణ్‌ సీరియల్‌ తాజాగా మరో కొత్త రికార్డును తన పేరిట లిఖించుకొంది. 

లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 28 నుంచి డీడీలో టెలికాస్ట్‌ అవుతున్న ఈ సీరియల్‌ను ఏప్రిల్‌ 16న 7.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు రీ టెలికాస్ట్‌లో భాగంగా ప్రసారమైన సీరియళ్లలో అత్యధికంగా వీక్షించిన సీరియల్‌గా రామాయణ్‌ నిలిచింది. 

ఈ విషయాన్ని ప్రసారభారతి తన ట్విటర్‌లో గురువారం అధికారికంగా వెల్లడించింది.    ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన ఎంటర్‌‌టైన్మెంట్‌ షోలో ఒకటిగా నిలిచిందని ట్వీట్‌ చేసింది. రోజుకు రెండు సార్లు దీన్ని టీవీలో ప్రసారం చేస్తున్నది. 

మొత్తం 72 ఎపిసోడ్లుగా ఉన్న  రామాయణ్    సీరియల్‌ దూరదర్శన్‌లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్ ప్రసారమవుతుంది. 

1987లో దూరదర్శన్‌లో మొదటిసారిగా ప్రసారమైన రామాయణ్‌ సీరియల్‌ను రామానంద సాగర్‌ దర్శకత్వం వహించారు. సీరియల్‌లో రామునిగా అరుణ్‌ గోవిల్‌, సీతగా దీపికా చిలాకియా, రావణునిగా అరవింద్ త్రివేది, హనుమాన్‌గా ధారాసింగ్‌ తదితరులు నటించారు.