ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రధాని మోదీ దృష్టి 

కరోనా వైరస్ ప్రభావంతో చతికలబడిన భారత  ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించారు. పెట్టుబడులపై సమీక్షించారు.  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఉన్నతాధికారులతో గత సాయంత్రం సమావేశమై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు.

చైనా నుంచి బయటికి వచ్చే ఎంఎన్‌సీలను ఆకర్షించేందుకు, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఇటీవల రాష్ట్రాల సీఎంలను కోరారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ప్రధాని ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించడం విశేషం.

ప్రస్తుతం ఉన్న పారిశ్రామికవాడలు, ఎస్టేట్‌లు, ప్లాట్లలో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ పద్దతిలో మౌలిక సదుపాయాలు కల్పించే అంశం ఈ సమావేశంలో చర్చించినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ పద్దతిలో కంపెనీలు పెద్దగా కాలయాపన లేకుండా తమ యూనిట్లను ఈ ప్రాంతాల్లో వెంటనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. 

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సానుకూల చర్యలు తీసుకోవాలని కూడా ప్రధాని మంత్రులు, అధికారులను ఆదేశించారు. గనులు, బొగ్గు రంగంలో మరిన్ని ఆర్థిక సంస్కరణలకు ఉన్న అవకాశాలపైనా ప్రధాని ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తున్నది.   

లాక్‌డౌన్‌తో స్తంభించిన మౌలిక నిర్మాణ వ్యవస్థ, పలు రకాల పరిశ్రమలు, వివిధ పారిశ్రామికవాడలలో పరిస్థితి గురించి ఈ సందర్భంగా విస్తృతస్థాయి సమీక్ష జరిగింది. తిరిగి పెట్టుబడులను రప్పించడం, పారిశ్రామిక వాతావరణం నెలకొనేలా చేయడం ముఖ్యమని, ఇందుకు రాష్ట్రాలు సహకరించాలని సూచనలు వెలువరించారు. 

విదేశీ పెట్టుబడులు, స్థానిక స్థాయిలలో పరిశ్రమలు ఇతర సంస్ధలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారి పెట్టుబడులకు సరైన సహకారం అందించాల్సి ఉందని మంత్రులు పేర్కొన్నారు. అవసరమైన అనుమతులను వెంటనే ఇప్పించాల్సి ఉందని సూచించారు. 

లాక్‌డౌన్ సమయంలో కేవలం దుకాణాలలో నిత్యావసర సరుకులు విక్రయించడం జరుగుతోంది. ఇతరత్రా ఉత్పత్తి కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు మొదలుకుని హీరో మోటో కార్ప్ లిమిటెడ్‌వంటి పెద్ద బ్రాండ్స్ సంస్థల వరకూ సాయానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. వేతన సబ్సిడీలు, పన్నుల వాయిదా, యుటిలిటి చెల్లింపులపై మారిటోరియంలు కోరుతున్నాయి.

గత నెలలో ఆర్థిక మంత్రి సీతారామన్ పేదలు, వలసకూలీలు, ఆపన్నులకు సాయం కోసం రూ 1.75లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు పారిశ్రామికవర్గాలకు రాయితీలు ఇతరత్రా సాయానికి కేంద్రం తక్షణ ప్రకటన ఏదీ చేయబోదని కొందరు మంత్రులు ఇటీవలే పరోక్షంగా తెలిపారు. 

కరోనా వైరస్ ఎంతటి నష్టం కల్గిస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేమని. ఈ దశలో ఇప్పటికే నిధుల కొరతతో ఉన్న కేంద్రం ఎటువంటి సహాయానికి ముందుకు రాకపోవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు.