క్రమంగా కంటైన్‌మెంట్‌జోన్ల ఎత్తివేత... పాతబస్తీపై దృష్టి

గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను క్రమంగా కంటైన్‌మెంట్ జోన్లు నుంచి ఎత్తివేసి పాతబస్తీపై దృష్టి సారించాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. నగరంలో వైరస్ ఉధృతిని బట్టి 141 కంటైన్‌మెంటు జోన్లుగా విభజించారు. 

 

వాటిలో మర్కజ్ వెళ్లిన నివసించే ప్రాంతాలను రెడ్‌జోన్‌గా చేసి ఆ ప్రాంతాల వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా రహదారులపై 8మీటర్ల ఎత్తులో బారికేడ్లు ఏర్పాటు చేసి, జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖ, పోలీసు అధికారులు ఇంటింటికి తిరిగి అనుమానితులు కనిపిస్తే వెంటనే గాంధీకి తరలించడం, చుట్టుపక్కల వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

గత పక్షం రోజుల నుంచి అధికారులు కంటైన్‌మెంట్ ప్రాంతాలను పెద్ద ఎత్తున జల్లెడ పట్టడంతో ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 542 కేసులు నమోదయ్యాయి. అందులో పాతబస్తీ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ ఉన్నాయి. గత కొద్దీ రోజులుగా నగరంలో కేసులు తగ్గుముఖం పడుతూ ఉండడంతో  జిహెచ్‌ఎంసీ అధికారులు 10 రోజులుగా ఒక కేసు నమోదు కానీ ప్రాంతాలను గుర్తించి కంటైన్‌మెంట్ జోన్లుగా తొలగించేందుకు కసరత్తు వేగం చేశారు.

ఇప్పటి వరకు 65 వరకు శివారు ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లు నుంచి ఎత్తివేశారు. త్వరలో మరో 25 జోన్లు కూడా ఎత్తివేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. వీటిని తొలగిస్తే పాతబస్తీలోని రెడ్ జోన్లపై ప్రత్యేక దృష్టి సారించి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వైద్యశాఖ బృందాలు వెల్లడిస్తున్నాయి. 

కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్ విధించడం ద్వారా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కేసులు నమోదుకానీ జోన్లకు లాక్‌డౌన్ నుంచి కొంత ఉపశమనం కలిగిస్తామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పూర్తిగా స్థాయిలో లాక్‌డౌన్ ఎత్తవేయాలంటే మే నెలాఖరు వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.