కరొనపై పోరులో కీలకం కానున్న మే 

కరోనా పై పోరులో మే నెల అత్యంత కీలకం కానున్నది. ఓవైపు దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేతకు కేంద్రం ప్రయత్నిస్తుండగా,మరోవైపు కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో 3వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుందో అన్నదానిపై ఆసక్తి నెలకొంది 

లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తివేస్తే ప్రమాదకరమని ముక్తకంఠంతో వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘ లాక్‌డౌన్ కొనసాగింపు అయినా, పూర్తి స్థాయి సడలింపులు అయినా ప్రతికూల ప్రభావం చూపుతాయని, దీనితో కేంద్రం వచ్చే ఒక్కటి రెండు రోజుల్లోనే అత్యంత కీలక నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని భావిస్తున్నారు. 

ఇప్పటి హాట్‌స్పాట్లపై తీవ్రస్థాయి కంటైన్మెంట్ అమలు వ్యూహాలు, ఇదే సమయంలో వైరస్ ప్రభావం లేని గ్రీన్‌జోన్లకు మినహాయింపులు ఉండాలని, కొన్ని సడలింపులు సర్వత్రా అవసరం అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

సోమవారం ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్‌డౌన్ , కరోనా వైరస్ కట్టడి, వలస కూలీల సమస్య గురించి మాట్లాడారు. వైరస్‌ను కట్టడి చేయాల్సి ఉందని, ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవల్సి ఉందని ప్రధాని పేర్కొనడం గమనార్హం. 

అయితే వైరస్ కదలికల నేపథ్యంలో మే నెల కూడా వ్యాప్తి నివారణపై అప్రమత్తత అవసరం అని తెలిపారు. ఈ నెల అంతా కూడా రైళ్లు, బస్సులు, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, విమాన ప్రయాణాలను నిలిపివేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే విధంగా మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌ల మూసివేత, మత ప్రార్థనా స్థలాలు, ఇతర చోట్లా కూడా ఇప్పటి కట్టడి కొనసాగాలని , లేకపోతే ఇప్పటివరకూ ఉన్న కరోనా కట్టడి వృధా అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.  

ఇప్పటికే పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. దేశంలో కోవిడ్ 19 హాట్‌స్పాట్ జిల్లాల సంఖ్య పదిహేను రోజుల క్రితం 170 ఉండగా ఇప్పుడది 129కి చేరింది. ఇక ఆయా జిల్లాల్లోనూ కొన్ని నిర్థిష్ట ప్రాంతాలలో వైరస్ తీవ్రత ఉంది. 

అయితే మొత్తం జిల్లాలలో తీవ్ర స్థాయి ఆంక్షలు విధించడం అనవసరం అనే సూచనలు విన్పిస్తున్నాయి. పక్షం రోజుల వ్యవధిలో నాన్ హాట్‌స్పాట్ జోన్స్ లేదా ఆరేంజ్ జోన్స్ సంఖ్య 207 నుంచి 297కు పెరిగింది.

ఇలా ఉండగా,  లాక్‌డౌన్‌ను మరింత పొడిగించినట్లయితే కరోనా వైరస్ కంటే ఎక్కువగా ఆకలి మరణాలు చూడాల్సి వస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి హెచ్చరించారు. 

కరోనా వైరస్ ఒక కొత్తరకం సాధారణ వైరస్ అని దేశం అంగీకరించక తప్పదని, పనులు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించాలని, అదే సమయంలో రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

ప్రపంచంలోనే అత్యంత కాల్యుష్య దేశం భారతదేశం అని చెబుతూ దేశంలో ఏడాదికి 90 లక్షల అనేక కారణాల వల్ల మరణిస్తున్నారని, దీనితో పోలిస్తే గత రెండు నెలల్లో 1000 మంది మృతి చెందడం ఆందోళన కల్గించేది కాదనే విషయం గమనించాలని మూర్తి స్పష్టం చేశారు.