రష్యా ప్రధాని, పాకిస్తాన్ స్పీకర్ లకు వైరస్ 

కరోనా బారినపడిన దేశాల అగ్రనేతల జాబితాలో రష్యా ప్రధాని మిఖాయిల్‌ మిషుస్టిన్‌ (54) సైతం చేరిపోయారు. దీంతో ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లారు. 

ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షించే మిషుస్టిన్‌ తరచూ అధ్యక్షుడు పుతిన్‌ను కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరు చివరిసారిగా ఎప్పుడు భేటీ అయ్యారనే వివరాలు ఆరా తీస్తున్నారు.  

మరోవంక, పాకిస్థాన్ నేష‌న‌ల్‌ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖురేషీ కరోనా వైరస్ బారినపడ్డారు. గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతోపాటు ఆయన కుటుంబసభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. 

అయితే, స్పీక‌ర్ ఖురేషి రెండు రోజుల క్రితం ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో స‌మావేశం కావ‌డం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ఖురేషి‌ ఎవరెవరిని కలిశారో గుర్తించి అంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. 

ఇలా ఉండగాగత 24 గంటల్లో రష్యాలో కొత్తగా 7,099 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,06,498కి చేరింది. ఈ వైరస్‌ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,074 మంది మరణించారు.

 మొత్తం కేసుల సంఖ్యలో చైనా, ఇరాన్‌లను వెనక్కి నెట్టిన రష్యా లక్ష కరోనా పాజిటివ్‌లు దాటిన ఎనిమిదో దేశంగా నిలిచింది. అత్యధికంగా అమెరికాలో 10,64,572 కేసులు నమోదవగా, స్పెయిన్‌లో 2,36,899, ఇటలీలో 2,03,591, ఫ్రాన్స్‌లో 1,66,420 కరోనా కేసులు రికార్డయ్యాయి. 

స్పెయిన్‌లో 268, ఇటలీలో 285 మంది చనిపోయారు. గత ఏడు వారాల్లో ఇదే అత్యల్పం. ఐరోపా ఇంకా కరోనా గుప్పిట నుంచి బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఐరోపా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 

కొత్తగా 874 కేసులతో పాకిస్థాన్‌లో బాధితుల సంఖ్య 15 వేలు దాటింది. 346 మంది పాణ్రాలు కోల్పోయారు. సింగపూర్‌లో మరో 588 మందికి పాజిటివ్‌ తేలగా, బాధితుల సంఖ్య 16,169కి చేరింది. బ్రిటన్‌.. రోజుకు లక్ష మందికి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది.