25 శాతానికి పైగా కరోనా నుండి రికవరీ

భారత్ లో కరోనా వైరస్ సోకి కోలుకొంటున్న  వారి సంఖ్య 25 శాతానికి పెరిగింది. గత 14రోజుల నుంచి వృద్ధి రేటు నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 8,889 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు.  దేశంలో కోవిడ్ మరణాల రేటు 3.2 శాతంగా ఉందని పురుషులు 65 శాతం, స్త్రీలు 35 శాతం ఉన్నట్లు తెలుస్తున్నది. 

గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 73 మంది కరోనా వల్ల మరణించినట్లు పేర్కొంది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరినట్లు వెల్లడించింది. 

ఇప్పటివరకూ భారత్‌లో కరోనా బారిన పడి 1147 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతమున్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 25,007గా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా న‌మోదైన క‌రోనా కేసుల్లో స‌గానికి పైగా మూడు రాష్ట్రాల్లోనే మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, ఢిల్లీల్లో క‌లిపి న‌మోద‌య్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటింది.

ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పంజాబ్‌లో 11నుంచి 20 రోజుల మధ్య కోవిడ్-19 కేసులు రెట్టింపు నమోదైతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. మార్చి 25నుంచి కొనసాగుతున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ వైరస్‌ను నిరోదించగలిగిందని పేర్కొన్నారు.

దేశ‌వ్యాప్తంగా రెడ్ జోన్ల సంఖ్య త‌గ్గింది. గ‌త 15 రోజుల్లో ఆ సంఖ్య 23 శాతం త‌గ్గిన‌ట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ 15వ తేదీన 170గా ఉన్న రెడ్ జోన్ల సంఖ్య‌.. ఏప్రిల్ 30వ తేదీకి 130కి చేరుకున్న‌ది. ఎటువంటి కొత్త కోవిడ్ కేసులు లేని గ్రీన్ జోన్ల సంఖ్య కూడా 356 నుంచి 319కి త‌గ్గింది. అయితే ఆరెంజ్ జోన్లు మాత్రం 207 నుంచి 284 వ‌ర‌కు పెరిగాయి.