అమెరికాలో చిక్కుకున్న వారికై ఆన్‌లైన్‌ పోర్టల్ 

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ప్రపంచం అంతా నిర్భందంలోకి వెళ్లింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంపై దృష్టి సారించాయి. భారత ప్రభుత్వం కూడా కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి, దశల వారీగా విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బ్లూ కాలర్ ఉద్యోగులను తర్వాత వివిధ దేశాల్లో ఉన్న విద్యార్థులను అనంతరం ఇతర కేటగిరీ వారిని భారత్‌కు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు  అగ్రరాజ్యంలో చిక్కుకున్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా  ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులను కూడా అధికారులు సంప్రదిస్తున్నారు. 

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత తిరిగి భారత్‌కు  వెళ్లాలనుకునే వారు https://indianembassyusa.gov.in/Information_sheet1‌లో రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే అమెరికాలో చిక్కుకున్న వారిని భారత్ కు తరలించే తేదీలపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు.