గల్ఫ్ భారతీయులకు ఆన్‌లైన్ నమోదు 

భారతీయులు స్వదేశం వెళ్లేందుకు వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (యుఎఇ) భారత రాయబార కార్యాలయాలు ఆన్‌లైన్ నమోదు‌ను ప్రారంభించాయి. 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల అనేకమంది భారతీయులు ఇక్కడ చిక్కుకుపోయారు. దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్ వెబ్‌సైట్ ద్వారా సేకరించిన భారతీయుల డేటా వివరాల్ని అబుదాబిలోని భారత ఎంబసీ ప్రకటించింది. 

భారతదేశం వెళ్లాలనుకునేవారు రిజిస్టర్ చేసుకునేందుకు వీలుగా అబూ దాబీలోని భారత రాయబార కార్యాలయం, ఇండియా కాన్సులేట్ జనరల్ ఒక డేటాబేస్‌ను ప్రారంభించింది. 

www.indianembassyuae.gov.in లేదా consulate www.cgidubai.gov.in ద్వారా ‘రిజిస్టర్ ఇయన్ డేటా బేస్ ఆఫ్ ఇండియన్స్ టు ట్రావెల్ బ్యాక్ టు ఇండియా అండర్ COVID19 సిట్యుయేషన్’ అనే లింక్‌తో భారతీయులు తమ వివరాల్ని ఎంబసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని దుబాయ్‌లో భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

మరో లింక్ www.cgidubai.gov.in/covid_register అనే లింక్ ద్వారా కూడా భారతీయులు తమ వివరాల్ని నమోదు చేసుకోవచ్చు అని ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ పోస్ట్ చేసిన కొన్ని నిముషాలకే సాంకేతిక కారణాల్ని పేర్కొంటూ ఎంబసీ దాన్ని తీసేసింది. 

బహుశ ఈ పేజీ లింక్‌ను పొందడంలో వినియోగదారులు ఇబ్బంది పడడం ఇందుకు కారణమని భావిస్తున్నారు. దుబాయ్‌లో భారత్ కాన్సులేట్ ఈ లింక్‌ను తిరిగి పోస్ట్ చేసింది. ‘ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున పేజీ లోడ్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు’ అని హెచ్చరించింది.