వుహాన్ వైరాల‌జీ ల్యాబ్‌తో క‌రోనాకు లింక్   

చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఉన్న వైరాల‌జీ ల్యాబ్‌తో క‌రోనా వైర‌స్‌కు లింకు ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ దేశంపై మ‌రోసారి భారీ స్థాయిలో వాణిజ్య ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్రకటించారు. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల సుమారు 2.30 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. నోవెల్ క‌రోనా వైర‌స్ వుహాన్ వైరాల‌జీ ల్యాబ్ నుంచి విస్త‌రించిన‌ట్లు వ‌దంతులు వ‌స్తున్న నేప‌థ్యంలో దీనిపై మీడియా స‌మావేశంలో ట్రంప్ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. 

క‌రోనా మ‌హ‌మ్మారికి వుహాన్ ల్యాబ్‌తో లింకు ఉన్న‌ట్లు మీ ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయా అని రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌కు ట్రంప్ అవున‌ని స‌మాధానం ఇచ్చారు.  అంత న‌మ్మ‌కంగా ఎలా చెబుతున్నార‌ని మ‌రో ప్ర‌శ్న వేయ‌గా ఆ విష‌యాల‌ను తాను బ‌హిర్గ‌తం చేయ‌ద‌లుచుకోలేదని పేర్కొ‌న్నారు.  

క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో చైనా పొర‌పాటు చేసిన‌ట్లు ట్రంప్ ప‌దేప‌దే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. చైనా వ‌స్తువుల‌పై అధిక సుంకాలు విధించ‌నున్న‌ట్లు కూడా తెలిపారు.  

కాగా, ప్రజలు మాస్కులను ధరించడం, నిర్ణీత దూరాన్ని పాటించడం తాను చూడలేనని ట్రంప్‌ తెలిపారు. ఆంక్షల్ని కొనసాగించబోమని  చెప్పారు. వైరస్‌ కట్టడిలో భాగంగా విధించిన ఆంక్షల గడువు ముగియనున్న సమయంలో  ట్రంప్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

కనిపించని శత్రువు చేసిన దాడితో తీవ్రంగా ప్రభావితమైన అమెరికా ప్రజలకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థ నాలుగో త్రైమాసికంనాటికి పట్టాలెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.