క‌ర్ణాట‌క‌లో న‌లుగురు మంత్రుల‌కు క్వారెంటైన్‌

క‌ర్ణాట‌క‌లో ఒక జ‌ర్న‌లిస్టుకు క‌రోనా పాజిటివ్‌గా తేలడంతో ఇటీవ‌ల ఆ జ‌ర్న‌లిస్టు ఎవ‌రెవ‌రిని క‌లిశారో వారంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. జ‌ర్న‌లిస్టు క‌లిసిన‌ వారిలో ఆ రాష్ట్రానికి చెందిన న‌లుగురు మంత్రులు కూడా ఉండ‌టంతో వారంతా సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. 

ఈ నెల 24న కర్ణాట‌క‌కే చెందిన ఓ టీవీ వీడియో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయన ఏప్రిల్ 21 నుంచి 24 మధ్య వివిధ శాఖల మంత్రులను కలిశారు.  దీంతో వారంతా సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్తున్న‌ట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

సెల్ఫ్ ఐసోలేష‌న్‌కు వెళ్లే మంత్రుల జాబితాలో ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్‌, హోంమంత్రి బస్వరాజ్ బొమ్మ‌య్‌, వైద్య‌విద్య‌ మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక శాఖ మంత్రి సిటీ రవి ఉన్నారు. పరీక్షల్లో నెగెటివ్ అని తేలినప్పటికీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా తామంతా క్వారెంటైన్‌లోకి వెళ్తున్నామని మంత్రులు తెలిపారు.

కాగా, ఆ జర్నలిస్ట్ కుటుంభం సభ్యులు, ఈ సమయంలో ఆ జర్నలిస్ట్ ను కలిసిన ఇతర జర్నలిస్టులు మొత్తం 40 మందిని కూడా క్వారెంటైన్ కు తరలించిన్నట్లు అధికారులు తెలిపారు.