డ్రాగన్‌ దేశ జోరుకు భారత్ అడ్డుకట్ట! 

 ప్రపంచ జీడీపీలో అమెరికా తర్వాతి స్థానంలో ఉంటూ, విశ్వ ఉత్పాదక కేంద్రంగా ఎదుగుతున్న చైనా పరుగులకు కరోనా వైరస్‌ బ్రేకులు వేయడం భారత్ కు అవకాశంగా మారనున్నదా? 

ఒక వంక చైనా ఆధిపత్యాన్నీ కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాల్లో కదులుతూ ఉంటె, మరోవంక భారత్‌ రూపంలో డ్రాగన్‌ దేశ జోరుకు అడ్డుకట్ట పడే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. 

కరోనా కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతున్న సమయంలో  చైనా తయారీ రంగ సామర్థ్యం సహితం దెబ్బతిన్నది. అక్కడి విదేశీ సంస్థలన్నీ తమ కర్మాగారాలను మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమయంలో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ ఏమేరకు ఎదగగలదన్నదే నేడు అందరికి ఆసక్తి కలిగిస్తున్నది. 

అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి, భారత్‌లోని ఆ దేశ బడా కంపెనీల ప్రతినిధుల మధ్య గత వారం జరిగిన  ఓ సమావేశం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకోంది.  

భారత్‌లోని అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించగా, చైనా నుంచి వ్యాపారాలను తరలించడం, వాటిని భారత్‌లో నెలకొల్పడంపై ప్రధానంగా చర్చించారు. 

చైనాలో వ్యాపారం చేస్తున్న అమెరికా సంస్థల కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి కేంద్రంగా భారత్‌ ఉండగలదన్న ఏకాభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. ట్రంప్‌ సర్కారు సైతం ఇందుకు మద్దతు పలికింది.

 ‘ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఎన్నో పారిశ్రామిక కార్యకలాపాలకు అంతకంటే అనువైన దేశంగా భారత్‌ త్వరలోనే అవతరించగలదు’ అని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా దేశాల అసిస్టెంట్‌ కార్యదర్శిగా ఉన్న థామస్‌ వజ్దా విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే భారత్‌లో అమెరికా సంస్థల విస్తరణకు వీలుగా ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించాలని అగ్రరాజ్య ఆధారిత కంపెనీలు కోరుతున్నాయి. ఈ విషయమై భారత్ ప్రభుత్వానికి నచ్చచెప్పాలని ఆయా సంస్థలు ట్రంప్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.  

భారత్‌-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నందున ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చుకుంటే ఇరు దేశాలకు లాభదాయకమని వజ్దా భావిస్తున్నారు.  

మరోవంక తే కరోనాతో చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడానికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరమని, కాబట్టి అమెరికా సంస్థలను వ్యూహాత్మకంగా ఆకట్టుకోవడానికి ఇదే సరైన సమయమన్న అభిప్రాయాలు భారత ప్రభుత్వ వర్గాలలో సహితం వినిపిస్తున్నాయి. 

ఇదిలావుంటే పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రగతి శాఖ.. వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి ఈ అంశంపై అభిప్రాయ సేకరణ చేపడుతున్నది. ఇందుకోసం పలు మంత్రిత్వ శాఖలు, ఇతర శాఖల నుంచి సంయుక్త కార్యదర్శులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.