అమావాస్య నాడు పోలింగ్ పట్ల కెసిఆర్ కలత !

ముందస్తు ఎన్నికల కోసం సంబరపడి సాధించుకున్న టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ఎన్నికల కమీషన్ ప్రకటించిన షెడ్యుల్ పట్ల కలత చెందుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఏ పని చేస్తినా ముహూర్తాలు, వాస్తు దోషాలను పరిగణలోకి తీసుకొనే ఆయనకు అమావాస్య నాడు పోలింగ్ జరగడం, చవితి రోజున ఓట్ల లెక్కింపు జరపడం పట్ల ఆందోళనకరంగానే ఉన్నట్లు చెబుతున్నారు.

వాస్తవానికి అసెంబ్లీ రద్దు రోజున కెసిఆర్ ప్రకటించిన విధంగా నవంబర్ చివరి వారంలోనే ఎన్నికలు జరపడం కోసం ఎన్నికల కమీషన్ సిద్దపడినదని, అయితే ఓటర్ల జాబితా వివాదం హై కోర్ట్ ముందుకు రావడంతో ఆ మేరకు షెడ్యుల్ ప్రకటించడానికి వేనుకాడినదని చెబుతున్నారు. అందుకనే మధ్యాన్నం 12.30 గంటలకు జరుపవలసిన ప్రెస్ మీట్ ను 3 గంటలకు మార్చిన్నట్లుగా తెలుస్తున్నది.

తొలి తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకోకుండానే సెప్టెంబర్ ‌6న రద్దయిన విషయం తెలిసిందే. అత్యంత బలమైన గురుపుష్య యోగం, అమృతసిద్ధి యోగం, కేసీఆర్‌ అదృష్ట సంఖ్య 6.. ఇలా అన్నివిధాలా ఆలోచించాకే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్‌ ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ రద్దయినట్లైంది. వీటితో పాటూ కేసీఆర్‌ అదృష్ట సంఖ్య 6 వచ్చేలా టీఆర్‌ఎస్‌ పార్టీ 105 మంది (1+0+5= 6) తమ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్టు చెబుతున్నారు.

ఎన్నికల షెడ్యుల్‌ ప్రకటించిన కొద్ది సేపటికే కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ మొదటగా తేదీలపై స్పందించారు. ఏ రకంగా చూసినా కేసీఆర్‌కు ఎన్నికల షెడ్యుల్‌ కీడు చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అనుకూల ప్రతికూల పోస్టింగులు పెడుతున్నారు. అమావాస్య రోజు పోలింగ్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా ఉంటుందన్న విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. 

అయితే అమావాస్య ప్రభావం కేవలం ఒక పార్టీ, ఒక నేతపైననే ఉండే అవకాశం ఉండదని, అన్ని పార్టీలకు, నాయకులు అందరికి సమంగా వర్తిస్తుందని ఈ సందర్భంగా పలువురు సరిపెట్టుకొంతున్నారు. వాస్తు దోషం పేరుతో మొత్తం సచివాలయాన్ని పడగొట్టి మరొకటి, మరోచోట నిర్మించడానికి కెసిఆర్ ప్రయత్నించడం తెలిసిందే. అట్లాగే సిఎం క్యాంపు ఆఫీస్ విషయంలో సహితం గతంలో వై ఎస్ రాజశేఖరరెడ్డి హయంలో నిర్మించిన బ్రహ్మాండమైన భవనం ఉన్నప్పటికీ, మరో భవన సముదాయం భారీ వ్యయంతో నిర్మించారు.

రాజకీయ పార్టీలు, నేతలకు అనుకూలమైన ముహార్తలకు ఎన్నికలు జరపడం ఎన్నికల కమీషన్ కు సాధ్యం కాదు. దానితో ప్రకటించిన షెడ్యుల్ ను అనుసరించక తప్పదు గదా.