సందిగ్ధతలో 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులు 

అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్‌ కలలపై కరోనా నీళ్లు చల్లింది. జూన్‌ చివరినాటికి దాదాపు 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులు చట్టబద్ధంగా ఆ దేశంలో నివసించే హక్కును కోల్పోనున్నారు. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉండే పరిస్థితులు లేక, స్వస్థలాలకు వెళ్లే మార్గం లేక అడకత్తెరలో ఇరుక్కొంటున్నారు. 

హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్నవారిలో భారతీయులే అత్యధికం. దీంతో మనవారిపై ఈ ప్రభావం భారీగానే పడనుంది. హెచ్‌1బీ వీసాదారులు వేతనం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే అక్కడ చట్టబద్ధంగా నివసించేందుకు హక్కు ఉంటుంది. దానితో గడువు తీరినవారు అటు అమెరికాలో ఉండలేక, ఇటు భారత్‌కు వచ్చే దారిలేక వారు మానసిక క్షోభను గురవుతున్నారు. 

సుమారు 2,50,000 మంది ఉద్యోగులు అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. నివాస హోదా కోరని మరో వేలాది మంది కూడా స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.  గత 2 నెలల్లో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. స్థానికులతో పోలిస్తే విదేశీ ఉద్యోగులు మరింత సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 

కంపెనీలు వారిని వేతనం లేని సెలవుపై పంపడం, వేతనాన్ని తగ్గించడం లేదా వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతించడం వంటివి వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయి. ఈ విధంగానూ వారికి వీసా ముప్పు ఉంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులు 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వేరే వీసాకు మారడం లేదా దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. 

టెక్‌నెట్‌ అనే లాబీయింగ్‌ గ్రూప్‌ ఈ నెల 17న అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగానికి లేఖ రాసింది.  వీసా గడువు పూర్తయిన వారికి సెప్టెంబర్‌ 10 వరకు సమయమివ్వాలని కోరింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఆ లేఖపై స్పందించలేదు.