యుపి రావడానికి 100 అమెరికా కంపెనీలు సిద్ధం!

కోవిడ్‌-19 వైరస్ పుట్టుకకు కార‌ణ‌మైన చైనా నుంచి విదేశీ కంపెనీలు వెళ్లిపోతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ మంత్రి సిద్ధార్థ‌నాథ్ ఇంగ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చైనా నుంచి వెళ్లిపోవాల‌ని చూస్తున్న దాదాపు వంద‌కంపెనీలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త‌మ శాఖ‌లను నెల‌కొల్పేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని వెల్లడించారు. 

చైనాలో అమెరికా పెద్ద‌మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టింది. ఇప్పుడు చైనా నుంచి వెళ్లిపోతున్న ఆ పెట్టుబ‌డుల‌ను భార‌త్‌లో ముఖ్యంగా యూపీలో పెట్టేలా చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ముఖ్య‌మంత్రి ఆధిత్య‌నాథ్ కోరుకుంటున్నారు. ఓ వెబినార్ ద్వారా వంద కంపెనీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించామని ఆ మంత్రి వెల్ల‌డించారు.   

మరోవంక, లాక్‌డౌన్ కార‌ణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుబ‌డిపోయిన ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన వ‌ల‌స కూలీల‌ను స్వ‌రాష్ట్రానికి చేర్చేందుకు యోగీ ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం బృహ‌త్ సంక‌ల్పం చేసింది. ఏకంగా ప‌ది లోక్ష‌ల మందిని రోడ్డుమార్గాల ద్వారా స్వ‌గృహాల‌కు చేర్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. 

ఇప్ప‌టికే హ‌ర్యానా నుంచి  12,200 మందిని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆర్టీసీ బ‌స్సుల్లో త‌ర‌లించింది. మ‌రికొన్ని పొరుగు రాష్ట్రాల నుంచి ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు వేలాది బ‌స్సుల‌ను సిద్ధం చేసింది.  ఇప్ప‌టికైతే దేశంలో మే 3 దాకా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. ఆ త‌ర్వాత లాక్‌డౌన్ ఎత్తేస్తార‌న్న న‌మ్మ‌కం కూడా లేదు. 

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కూడా కొన్ని స‌డ‌లింపులే ఉంటాయ‌న్న సంకేతాలు ఇవ్వ‌టంతో త‌మ రాష్ట్ర‌వాసులంద‌రినీ త‌ర‌లించ‌టం మొద‌లుపెట్టింది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. యూపీ కూలీలు ఎక్కువ‌గా తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కర్ణాట‌క‌, పంజాబ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, రాజ‌స్థాన్‌, బిహార్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో ఉన్నారు. 

వారంద‌ర‌నీ స్వ‌రాష్ట్రానికి త‌ర‌లించటం మొద‌లుపెట్టారు. అయితే వారికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాతే స్వ‌రాష్ట్రానికి తీసుకెళ్తామ‌ని అధికారులు తెల‌పారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారిని క్వారంటైమ్‌లో ఉంచేందుకు ప్ర‌త్యేక షెల్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆధిత్య‌నాథ్ అన్ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.