ఏపీలో 12 మంది డాక్టర్లకు కరోనా వైరస్ 

ఏపీలో కరోనా కట్టడికోసం ముందుండి పోరాడుతున్న వారిలో31 మందికి వైరస్ సోకున్నట్లు వెల్లడైనది. వారిలో క‌రోనా రోగులకు చికిత్స ఇస్తున్న 12 మంది డాక్ట‌ర్లు, 12 మంది న‌ర్సులు, ఏడుగురు పారిశుధ్య కార్మికులు ఉన్నార‌ని ఆరోగ్య శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్రెట‌రీ జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. 

అలాగే రాజ్ భవన్ లో న‌లుగురికి కరోనా పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమేన‌ని చెబుతూ గవర్నర్ దంప‌తుల‌కు కూడా టెస్ట్ చేశామ‌ని, వారికి నెగటివ్ వచ్చిందని చెప్పారు. 

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన పరీక్షల్లో 73 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసులు 1332 కాగా.. 287 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 31 మరణించారు. ప్రస్తుతం 1014మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కువగా 29 కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. 

దానితో  ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 283 కాగా, కర్నూల్‌లో 343, కృష్ణా 236, నెల్లూరు 82, చిత్తూరు 77, కడప 69, ప్రకాశం 60, పశ్చిమగోదావరి 56, అనంతపురం 58, తూర్పుగోదావరి 40, విశాఖ 23, శ్రీకాకుళం జిల్లాలో 05 కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో కొత్త కేసులన్నీ కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచే వస్తుండటం గమనార్హం.

 ‘ప్రతి పదిలక్షల మందికిగానూ 1504 పరీక్షలు చేస్తూ దేశంలోనే ముందంజలో ఉన్నాం. పాజిటివ్‌ కేసులు దేశంలో సగటున 4.13 శాతం ఉంటే, రాష్ట్రంలో 1.57 శాతమే. మరణాల రేటు జాతీయస్థాయిలో 3.19 శాతం  ఉంటే.. రాష్ట్రంలో 2.46 శాతమే' అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.