వెయ్యి రూపాయలకే కరోనా వ్యాక్సిన్‌  

దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను రూ.1000లకే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రముఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా చెప్పారు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నాటికి రెండు నుంచి నాలుగు కోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

మేలో మనుషులపై వ్యాక్సిన్‌ ఔషధ పరీక్షలు (హ్యూమన్‌ ట్రయల్స్‌) నిర్వహిస్తామని చెప్పారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్‌ కోసం సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ట్రయల్స్‌ కోసం తాము వేచి చూడట్లేదని పూనావాలా స్పష్టం చేశారు. 

సొంత వ్యయంతో, రిస్కుకు లోబడి తమకు తాముగా  ట్రయల్స్‌ను నిర్వహించి వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నామని చెప్పారు. ట్రయల్స్‌ విజయవంతమైతే మొదటి ఆరు మాసాలు నెలకు నలభై నుంచి యాభై లక్షల డోసులను, ఆతర్వాత క్రమంగా నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ. 1,140 కోట్లను వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.