ఆగస్టు 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆగస్టు 1నుంచి నూతనవిద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని యూనివర్సిటీల గ్రాంట్ల కమిషన్‌ (యూజీసీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసుచేసింది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, జాతీయ విద్యాసంస్థలకు వర్తింపజేయాలని కోరింది. 

ఆగస్టు 1 నుంచి ద్వితీయ సంవత్సరం తరగతులు, సెప్టెంబర్‌ 1 నుంచి తొలి సంవత్సరం తరగతులను ప్రారంభించాలని పేర్కొన్నది. ఆగస్టు 31 వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది. 

యూజీసీ సిఫారసుల మేరకు 2021 జనవరి 1 నుంచి 25 వరకు మొదటి సెమిస్టర్‌, మే 26 నుంచి జూన్‌ 25 వరకు రెండో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. 2021 జూలై 1 నుంచి 30 వరకు వేసవి సెలవులు ప్రకటించాలి. 

2019-20  ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రకారం ఈ ఏడాది జనవరిలో సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16 నుంచి తరగతులు రద్దు చేశారు. మార్చి 13 నుంచి మే 15 వరకు ఈ లెర్నింగ్‌ ద్వారా విద్యాబోధన కొనసాగిస్తున్నారు.  

ఈ ఏడాది మే 16 నుంచి 31 వరకు ప్రాజెక్టువర్కులు, ఇంటర్న్‌షిప్‌ రిపోర్టులు, ఈ ల్యాబులు, సిలబస్‌, ఇంటర్నల్‌ అసైన్‌మెంట్‌, స్టూడెంట్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ వంటి విద్యాకార్యకలాపాలు నిర్వహించాలి. 

ఈ ఏడాది జూన్‌ 1 నుంచి 30 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూలై 1 నుంచి 15 వరకు టెర్మినల్‌ (సంవత్సరం) పరీక్షలు.. జూలై 16 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయి.  

పరీక్షలను వ్యాసరూపంలో కాకుండా మల్టిపుల్‌ చాయిస్‌ విధానం (ఓఎమ్మార్‌) విధానంలో పరీక్షలు నిర్వహించవచ్చని యూజీసీ పేర్కొన్నది. 

అలా కానిపక్షంలో ఓపెన్‌బుక్‌, ఓపెన్‌ చాయిస్‌, అసైన్‌మెంట్‌, ప్రజెంటేషన్‌ పద్ధతులను పరీశీలించవచ్చని చెప్పింది. యూజీసీ చేసిన ఈ సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.