కోవిడ్‌19 స‌మ‌యంలో తీవ్ర‌వాదం పెరిగే ప్ర‌మాదం  

ఆన్‌లైన్‌లో తీవ్ర‌వాదుల రిక్రూట్‌మెంట్ కొనసాగుతున్న‌ట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్ర‌స్ హెచ్చరించారు.   కోవిడ్‌19 మ‌హమ్మారి స‌మ‌యంలో.. తీవ్ర‌వాదం పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

యువ‌తలో ఉన్న అస‌హ‌నం, ఆవేశాన్ని కొంద‌రు దుర్వినియోగం చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు.  ప్ర‌స్తుతం ఉన్న సంక్షోభం క‌న్నా ముందు నుంచే యువ‌త అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న‌ద‌ని ఆయ‌న భ‌ద్ర‌తా మండ‌లికి విన్న‌వించారు. 

అయిదుగురిలో ఒక‌రు విద్య‌ను అభ్య‌సించ‌డంలేద‌ని,  వారికి ఎటువంటి శిక్ష‌ణ కానీ, ఉద్యోగం కానీ లేదని పేర్కొ‌న్నారు. ఇక న‌లుగురిలో ఒకరు హింస‌కు గుర‌వుతున్న‌ట్లు చెప్పారు.

ప్ర‌తి ఏడాది సుమారు కోటి 20 ల‌క్ష‌ల మంది బాలిక‌లు త‌ల్లులుగా మారుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వాలు అనేక స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో విఫ‌లం కావ‌డం వ‌ల్లే, రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల‌పై ప్ర‌జాగ్ర‌హం పెరుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

ఇలాంటి సంద‌ర్భంలోనే తీవ్ర‌వాద సంస్థ‌లు యువ‌త‌ను రిక్రూట్ చేసుకుంటాయని పేర్కొ‌న్నారు. దీంతో ఉగ్ర‌వాదం పెరుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. 

యువ‌త‌కు శాంతి, భ‌ద్ర‌త సందేశం ఇవ్వాల‌ని,  ప్ర‌స్తుతం ఉన్న విప‌త్క‌ర  త‌రుణంలో ఒక త‌రాన్ని మ‌నం కోల్పోకూడ‌ద‌ని హితవు చెప్పారు. శాంతియుత‌మైన‌, సుర‌క్షిత‌మైన‌, స‌మాన‌మైన స‌మాజాన్ని నిర్మించాలంటే.యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పించాలని సూచించారు.