కరోనాకు అక్షయ కుమార్ మరో రూ 2 కోట్ల విరాళం 

కరోనాపై పోరాటానికి ఇప్పటికే రూ.28 కోట్లు విరాళాన్ని ప్రకటించిన బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. మహారాష్ట్రలో కరోనాను ఎదుర్కొనేందుకు పోరాడుతున్న పోలీసులకు రూ.2కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ముంబై పోలీస్‌ ఫౌండేషన్‌కు ఆ మొత్తాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా ముంబై పోలీసులు అక్షయ్‌కుమార్‌‌కు ధన్యవాదాలు తెలిపారు. “ ముంబై పోలీసుల కోసం రూ 2 కోట్లు విరాళం ఇచ్చిన అక్షయ్‌కుమార్‌‌కు థ్యాంక్స్‌. సిటీని కాపాడేందుకు పాటుపడుతున్న ప్రతి ఒక్కరి కోసం ఈ డబ్బును ఉపయోగిస్తాం” అని ముంబై పోలీస్‌ కమిషనర్‌‌ పరమ్‌ బీర్‌‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. 

దీనిపై అక్షయ్‌కుమార్‌‌ రిప్లై ఇచ్చారు. “ ముంబై పోలీసులకు నా సెల్యూట్‌. కరోనాతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన హెడ్‌ కానిస్టేబుల్స్‌ చంద్రకాంత్‌ పెందుర్కర్‌‌, సందీప్‌ సుర్వే తమ ప్రాణాలను కోల్పోయారు. పోలీసుల వల్లే మనం భద్రంగా ఉన్నామని మరిచిపోకండి. నా వంతు బాధ్యత నేను చేశాను” అని అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. 

కరోనాపై పోరాటం చేసేందుకు అక్షయ్‌కుమార్‌‌ గతంలో పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.25 కోట్లు, ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేసే వారికి పీపీఈ కిట్లు కొనేందుకు రూ.3 కోట్లు ఇచ్చారు.