బయటకొస్తే అంబులెన్స్‌లో క్వారంటైన్‌ కేంద్రాలకే 

ఏపీలో ఒక వంక కరోనా మహమ్మారి ఉధృత రూపం దాల్చుతూ అదుపు తప్పుతుండగా, లాక్ డౌన్ నిబంధనలను సహితం పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి వస్తూ ఉండడంతో పోలీసులు అదుపు చేయలేక తికమకపడుతున్నారు.  

నాలుగైదు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో పోలీసులు మరింత కఠిన చర్యలు చేపట్టక తప్పడం లేదు. ముఖ్యంగా వైరస్ ఆందోళనకరంగా మారిన విజయవాడ, కర్నూలు, నెల్లూరు లాంటి చోట్ల ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. 

‘ఎంత చెప్పినా వినడంలేదు.. లాఠీలు ఎత్తితే ఆరోపణలు వస్తున్నాయి.. వాహనాలు సీజ్‌ చేస్తే నడుచుకొంటూ రోడ్డెక్కుతున్నారు.. వదిలేద్దామంటే కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్నాయి.. వీటన్నిటికీ చెక్‌ పెట్టాలంటే పోలీసు జీపులో స్టేషన్‌కు కాకుండా అంబులెన్స్‌ ఎక్కించి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించడమే ఉత్తమం’ అనే నిర్ధారణకు ఏపీ పోలీసులు వచ్చారు. 

కర్నూలు, విజయవాడ, గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా చాలాచోట్ల ప్రజలు వినడం లేదని, ఆదివారం మాంసం దుకాణాల వద్ద ఎగబడి తోసుకొంటున్నారని, కట్టడి చేయలేక దుకాణాలు మూయించేశామని పోలీసు అధికారులు చెప్పారు.  

అధికారుల అభిప్రాయాలు విన్న తర్వాత అనవసరంగా బయటికి వచ్చిన వారిని అంబులెన్స్‌లో క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తే ఫలితం ఉండొచ్చని డీజీపీ స్పష్టం చేశా చేశారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారికి ఈ-పాస్‌ తప్పని సరి అని చెప్పారు.  దీన్ని పలువురు పోలీసు ఉన్నతాధికారులు సమర్థించారు. 

దీంతో సోమవారం కృష్ణలంక, మాచవరంలో పోలీసులు ఉదయం పది గంటల తర్వాత రోడ్లపై కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆపి ఆరా తీశారు. సరైన కారణం, ఆధారం చూపించని వారిని అంబులెన్స్‌ ఎక్కించి క్వారంటైన్‌కు పంపారు. అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు సైతం ఆకతాయిలకు ఇదే తరహా పనిష్మెంట్‌ ఇచ్చారు.