అమెరికాలో భారత  వైద్యుల అసమాన సేవలు 

కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికాలో  భారత సంతతి వైద్యులు విశేష సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. అగ్రరాజ్యంలో రోగులకు చికిత్సనందిస్తున్న ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయుడేనని ‘భారతీయ సంతతి అమెరికా వైద్యుల సంఘం’ (ఏఏపీఐ) అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి తెలిపారు. 

కొవిడ్‌-19ను అడ్డుకోవడానికి భారత సంతతి వైద్యులు సైనికుల్లా పోరాడుతున్నారని చెబుతూ కరోనాపై పోరాటం దీర్ఘకాలం సాగుతుందని చెప్పారు. లాక్‌డౌన్‌తో ప్రజల్లో పెరుగుతున్న అసహ నం, కోపాన్ని అర్థం చేసుకోగలనని అయితే, విశ్వమారి కట్టడికి ఇదే సరైన మార్గమని స్పష్టం చేశారు. దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వాలకు సూచించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే పరిస్థితులు ఇంకా దిగజారుతాయని హెచ్చరించారు. 

‘ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం, రోగులకు వైద్య సిబ్బంది తగిన చికిత్స అందించడం, సాధారణ ప్రజలు క్రమశిక్షణతో నిబంధలను పాటించడం’.. ఈ మూడు సూత్రాలతో కరోనాను కట్టడి చేయొచ్చని సురేశ్‌రెడ్డి సూచించారు.

భారత సంతతి వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు కాపాడుతున్నారు. న్యూయార్క్‌లో భారత సంతతి వైద్యురాలు మాధవి ఇటీవలే వైరస్‌ సోకి మరణించారు. 1994 నుండి న్యూయార్క్ లో వైద్య సేవలు అందిస్తున్న ఆమె చివరి రోజులలో ఆసుపత్రిలో సేవలు అందిస్తూ మొబైల్ సందేశాల ద్వారా మాత్రమే కుటుంభ సభ్యులను పలకరింప గలిగారు.  డోజన్ల కొద్దీ భారత సంతతి వైద్యులు కరొనపై పోరులో ముందుండి అమెరికాలో వైరస్ కు గురయ్యారు. ఎక్కువగా న్యూ యార్క్, న్యూ జెర్సీ లలో వైరస్ కు గురయ్యారు. 

 మూత్రపిండారాల వైద్య నిపుణురాలు ప్రియాఖన్నా ఇటీవలే న్యూజెర్సీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆమె తండ్రి, జనరల్‌ సర్జన్‌ సత్యేంద్ర ఖన్నా అదే దవాఖానలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. 

ఏఏపీఐ మాజీ అధ్యక్షుడు అజయ్‌ లోధాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈనెల మొదటి వారంలో న్యూజెర్సీలోని ఓ దవాఖానలో చికిత్స అందిస్తున్న భారత సంతతి వైద్యుడిపై కరోనా రోగి దాడి చేశాడు. ఆయన ముఖంపై వాంతి చేశాడు. దీంతో ఆయన వైరస్‌ సోకి మరణించారు. రోగుల దాడుల్లో పది మంది వైద్యులు గాయపడ్డారు. 

కరొనపై అమెరికా సాగిస్తున్న పోరులో నిజమైన హీరోలు భారత సంతతి వైద్యులే అని ఏఏపీఐ ఉపాధ్యక్షురాలు డా. అనుపమ గొట్టిముక్కల స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో చాలామంది వైరస్ కు గురయ్యారు. కొందరు మృతి చెందారు. కొందరు తీవ్రమైన పరిస్థితులలో ఆసుపత్రులలో ఉన్నారు. 80,000 మంది వైద్యులు ఉన్న ఈ సంఘం అమెరికాలోనే అతి పెద్ద వైద్యుల సంఘం కావడం గమనార్హం. 

అమెరికాలో ఈ వైరస్ మహమ్మారికి గురయిన వారిలో ఆసియా సంతతి వారు చాల తక్కువగా, కేవలం 4.4 శాతం మందిమాత్రమే ఉన్నారు. కానీ వైద్య సేవలు అందించడంలో మాత్రం హాట్ స్పాట్ లలో ఎక్కువగా భారత సంతతి వారే సేవలు అందిస్తూ ముందుంటున్నారు.  తమ వ్యక్తిగత భద్రతను సహితం లెక్కచేయకుండా, ఎంతో సాహసంతో భారత సంతతి వైద్యులు అమెరికాలో సేవలు అందిస్తున్నారని ఏఏపీఐ కార్యదర్శి రవి కొల్లి తెలిపారు.