టెస్టులు తగ్గించి కరోనా లేదంటున్న కేసీఆర్  

తెలంగాణలో కరోనా దాదాపు తగ్గిపోతున్నదను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెబుతున్నారు. అందుకు గత మూడు రోజులుగా పెద్దగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం చూపుతున్నారు. సోమవారం కొత్తగా రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, శనివారం 7, ఆదివారం 11 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1003కు చేరుకొంది. 

అయితే కొత్తగా వస్తున్న కేసులు అన్ని ఎక్కువగా హైదరాబాద్ నగర పరిధిలోనివి కావడం గమనార్హం. ముఖ్యంగా పాతబస్తీలో కూడా లాక్ డౌన్ ను లెక్కచేయడం లేదని, పోలీసులను సహితం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. స్థానికంగా కరోనా పరీక్షలకు సహకారం లభించడం లేదని అధికారులు వాపోతున్నారు. దానితో కరోనా టెస్ట్ లను బాగా తగ్గించి రాష్ట్రంలో కరోనా మాయం అవుతున్నట్లు చెప్పుకొంటున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి. 

పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చుకొంటే తెలంగాణలో ఏదో దాస్తున్నారనే అనుమానాలని టిజెఎసి వ్యక్తం చేసింది.  చాలాకాలం వరకు తెలంగాణ కన్నా బాగా వెనుకబడి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కేసుల విషయంలో చాలా ముందుకు వెళ్ళడానికి అక్కడ పరీక్షలు ఎక్కువ జరగడమే కారణం కావడం గమనార్హం. ఏపీలో ఇప్పుడు ఈ సంఖ్యా1177కు వెళ్లగా, తెలంగాణలో మాత్రం ఇప్పుడు 1000 దాటడం గమనార్హం. 

తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ జరిగిన పరీక్షలతో పోల్చుకొంటే వైరస్ సోకినా వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఏపీలో 1.66 శాతం మాత్రమే ఉంటె, తెలంగాణలో మాత్రం 5.35 శాతంగా ఉన్నది. అంటే తెలంగాణలో వైరస్ ఏపీలో కన్నా 3.2 రేట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఏపీలో 62 వేలకు పైగా టెస్ట్ లు  జరిపితే, తెలంగాణలో 20 వేలకు లోపుగానే జరిపారు. అంటే మూడోవంతకన్నా తక్కువగా టెస్ట్ లు ఇక్కడ జరుగుతున్నాయి. 

తెలంగాణలో కేసులు తక్కువగా ఉండడానికి ప్రధానంగా మూడు కారణాలు స్పష్టం అవుతున్నాయి.  తక్కువగా టెస్ట్ లు ఉండడం, ఆసుపత్రులలో మృతి చెందుతున్న వారిని కరోనా మృతులుగా పరిగణించక పోవడం. పాజిటివ్ కేసుల సెకండరీ కాంటాక్ట్ లకు టెస్ట్ లు జరుపవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం. 

వైరస్ ఉధృతిని కప్పిపుచ్చడం ద్వారా దీనిని కట్టడి చేయలేమని, కేవలం విస్తృతంగా టెస్ట్ లు జరపడం ద్వారానే సాధ్యం కాగలదని ప్రభుత్వం గమనించాలి.  తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరిగినప్పుడల్లా కేసుల సంఖ్య పెరగడం జరుగుతున్నది. ఉదాహరణకు మొన్న 450 పరీక్షలు చేస్తే, అందులో 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే పది శాతం కన్నా ఎక్కువ.