రాజకీయ ఆరంగేట్రంకు జెడి లక్ష్మీనారాయణ సిద్దం

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. స్వచ్చంద పదవీ విరమణ చేసినప్పటి నుండి రాజకీయ రంగ ప్రవేశం గురించి పలు ఉహగానలకు అవకాశం కల్పిస్తున్న ఆయన ఇప్పుడు వచ్చే ఎన్నికలలోగా రాజకీయ ప్రవేశం తధ్యం అనే సంకేతాలు ఇచ్చారు. ఈ విషయమై `రాజకీయ బేరసారాలు’ జరుగుతున్నట్లు సంకేతం ఇస్తూ “‘ప్రస్తుతం నా ఆలోచనలు మాత్రమే చెప్పాను, అవి తమతో కలిశాయా లేదా అనేది రాజకీయ పక్షాలు నిర్ధారించుకోవాలి” అంటూ రాజకీయ పార్టీలపై భారం మోపారు.

ఒకవిధంగా ఏ పార్టీ తనకు `ఆకర్షణీయ’మైన ఆఫర్ ఇస్తే ఆ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నట్లు తిరుపతిలో తెలిపారు. ప్రస్తుతం ఆయనకు తెలుగు దేశం, బిజెపి, జనసేన నేతలతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఎన్నికల ముందు ఆయా పార్టీలు ఎటువంటి హోదా ఇవ్వడానికి సిద్దపదగాలవో చూడవలసి ఉంది.

తన ఆలోచనలకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తులైనా కలిసి వస్తే వారితో పనిచేయడానికి సిద్ధమని, లేని పక్షంలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని తన అలోచనలను కార్యాచరణలో పెట్టడానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ వారు కుడా ఈ విషయమై తనతో సంప్రదింపులు జరుపలేదని స్పష్టం చేసారు.

ఈ లోగా రాష్త్రంలోని మొత్తం 13 జిల్లాలలో పర్యటనలను తిరుపతితో ముగించారు. శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడే తన ఆలోచనలకు ఒక రూపకల్పన చేశానని ఇక వాటిని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళతానని తెలిపారు. ధనం, కులాలకు అతీతంగా తన రాజకీయ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేస్తూ అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ఆలోచనా విధానమని వెల్లడించారు.

ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ధనం, కులం కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల సందర్భంగా 50 శాతం మంది ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే మంచి పరిపాలకులను ఎంచుకోవచ్చని,  అది ప్రజా సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అమలు కావాలన్నది తన ఆలోచన అని వివరించారు. ఎన్నికల తరువాత ఎవరు గెలుస్తారో సమస్యల పరిష్కారం కోసం వారిని ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ సదరు ఎన్నికైన అభ్యర్థి ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే వంద రూపాయల స్టాంప్‌పై సంతకం చేసిన ప్రతిపాదనలకు సంబంధించి న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయవచ్చని తెలిపారు.

“పీపుల్స్‌ మేనిఫెస్టో అనేది మా విజన్‌. ప్రతి గ్రామంలోని వారు తమకు ఏం కావాలో ప్రణాళిక తయారు చేసుకోవడమే ఈ మేనిఫెస్టో లక్ష్యం. దీని కోసం ప్రత్యేకమైన ఓ వెబ్‌సైటును రూపొందించాం. దీనిలో 13 జిల్లాల సమాచారాన్ని ఉంచి.. ఏం కోరుకుంటున్నారో, ఆయా గ్రామాల్లో ఎలాంటి సౌకర్యాలు కావాలో, సమస్యలు ఉన్నాయో మాతో పంచుకునేలా వెబ్‌సైటును తయారు చేశాం. ప్రతి గ్రామానికీ ఓ ప్రత్యేకమైన మేనిఫెస్టో తయారుచేస్తాం. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులకు ఇచ్చి... వారితో స్టాంపు పేపరుపై సంతకం చేయించి.. ఆ మేనిఫెస్టోను అమలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం” అని వివరించారు.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరికి వారు తెలియజేసేందుకు వీలుగా ‘ అవర్‌విలేజ్.ఓఆర్‌జీ’ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యలను మొబైల్ ఫోన్ల ద్వారా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరచే సౌలభ్యం కూడా అందులో ఉంచారు. భిన్న వర్గాల ప్రజల నుంచి వచ్చిన సమస్యలపైనే తాను ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి ముందుకెళతానని వెల్లడించారు.

త్వరలోనే తాను అధ్యయనం చేసిన ప్రజా సమస్యలపై తన వెబ్‌సైట్ ద్వారా వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయనతో భేటీ అవుతానని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తే చాలన్నారు. వీటి కోసం ప్రత్యేకంగా జీఓలు విడుదల చేయాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు.