చైనా టెస్టింగ్ కిట్స్ వెన‌క్కి పంప‌నున్న కేంద్రం

క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా టెస్టుల కోసం చైనా నుంచి భారీగా కిట్స్ దిగుమ‌తి చేసుకోగా వాటిని మ‌ళ్లీ వెన‌క్కి పంపించేందుకు చర్య‌లు చేప‌ట్టింది. 

చైనా టెస్టింగ్ కిట్స్ లో లోపాలు త‌లెత్తుతున్నాయ‌న్నా ఆరోప‌ణ‌ నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే చైనా టెస్టింగ్‌ కిట్స్‌ను  వెనక్కి పంపాల‌ని అన్ని రాష్ట్రాల‌ను ఐసిఎంఆర్ కోరింది. 

కరోనా నిర్ధారణ విషయంలో ఫెయిలవుతున్నాయన్న ఆరోప‌ణ‌ల‌ నేపథ్యంలో తాజా ఉత్త‌ర్వులు జారీ చేసింది.  చైనా కు చెందిన గ్వాంగ్జౌ వోన్డ్‌ఫో బయోటెక్, జుహాయి లివ్‌జాన్ డయాగ్నస్టిక్స్ కంపెనీల ఉత్పత్తుల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని స్పష్టం చేసింది. 

ఈ కిట్లు కచ్చితత్వంతో కూడిన ఫలితాలు వస్తాయని కంపెనీ భరోసా ఇచ్చింది, కానీ పరీక్షలు నిర్వహించినప్పుడు ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపించిందని ఐసీఎంఆర్ తెలిపింది. 

కేంద్రం సహా పలు రాష్ట్రాలు ఈ కిట్‌ల‌ను దిగుమతి చేసుకున్నాయని, వెంట‌నే వీటి వాడకాన్ని నిలిపివేసి, చైనాకు తిప్పి పంపించాలని ఆదేశించింది. 

ఆర్టీ-పీసీఆర్ విధానం ద్వారా నిర్వహించే పరీక్షలే కరోనా నిర్ధారణకు ప్రామాణికమ‌ని, ఈ విధానం ద్వారానే కరోనాను తొలి దశలోనే గుర్తించడం సాధ్యమ‌ని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి ఆర్టీ-పీసీఆర్ విధానమే అత్యుత్తమ మార్గ‌మ‌ని పేర్కొంది.  

మరోవంక,  దేశంలో క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్ర‌మంగా మెరుగుప‌డుతోంద‌ని కేంద్రం తెలిపింది. రిక‌వ‌రీ రేటు 22.71శాతంగా ఉంద‌ని ప్ర‌క‌టించింది.  

కరోనా సోకి కోలుకున్న వారి నుంచి కరోనా తిరిగి వ్యాప్తి చెందడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా నుంచి  కోలుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్ చేసి ఇతరులను కాపాడాలని, ఇందులో మరే సందేహాలు పెట్టుకోనవసరం లేదని సూచించారు. దీంతో ఈ విషయంపై నెలకొన్న భయాందోళనలు తొలగినట్లైంది.  

చైనా వూహాన్‌తో పాటు అనేక యూరప్ దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ సోకుతోందని, మిగతా వారికి వ్యాప్తి చెందుతుందనే వార్తలు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారినుంచి ఇప్పట్లో కోలుకోలేమనే అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే ప్రపంచ దేశాల పరిస్థితులకు భిన్నంగా భారత్‌లో కరోనా సోకి కోలుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని కేంద్రం స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  

గత 24 గంటల్లో కొత్తగా 1396 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో.. భారత్‌లో మొత్తం కరోనా నిర్ధారిత పాజిటివ్ కేసుల సంఖ్య 27,892కు చేరింది. భారత్‌లో ప్రస్తుతం 20,835 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. ఒక్కరోజులో 381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది