కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగింపు 

లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రులతో లాక్‌డౌన్‌పై జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కరోనా ప్రభావం తక్కువున్న రాష్ట్రాలలో జిల్లాల వారిగా సమీక్షిస్తామని వెల్లడించారు.  మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయని ఆయన ముఖ్యమంత్రులతో చెప్పారు. 

కరోనాపై లాక్‌డౌన్‌ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెబుతూ లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయని, వేలమంది ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యం  అని పేర్కొన్నారు. 

దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని, ఉపాధిహామీ పనులు, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయ్యాయని తెలిపారు. తక్షణ స్పందన మన లక్ష్యం కావాలని చెబుతూ దో గజ్ దూరీ (2 గజాల దూరం) మన మూల మంత్రం కావాలని సూచించారు. 

లాక్‌డౌన్ ఎత్తేసేందుకు ప్లాన్ రూపొందించాలని, అందుకోసం రెడ్, గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల విభజన చేసుకోవాలని మోదీ ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. అయితే నలుగురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడగింపు వైపే మొగ్గు  చూపినట్లు తెలిసింది. 

కాగా, కరోనాతో పోరు కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధాని సూచించారు. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం కనిపిస్తుందని చెబుతూ అందుకే మాస్కులు, ఫేస్ కవర్లు జీవితంలో భాగం కావాలని స్పష్టం చేశారు. దేశం ఇప్పటికే 2 లాక్‌డౌన్లు చూసింది. ఇక ముందు ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. 

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ సంస్కరణలు తీసుకురావాలని చెబుతూ హాట్‌స్పాట్ - రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ప్రధాని స్పష్టం చేశారు.  రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.