త్వరలో  పలు దేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులు

క‌రోనా ఎఫెక్ట్‌తో పలు దేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల్ని స్వదేశానికి తీసుకువ‌చ్చేందుకు కేంద్రం చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మే 3 తో లాక్‌డౌన్ గ‌డువు ముగుస్తుండ‌టంతో త‌ర్వాత‌ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇందుకోసం త్వ‌ర‌లోనే ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ  కేంద్రం ప్ర‌క‌టించ‌నుంది. ఈ మేర‌కు విదేశాల్లో ఉన్న జాబితాను కేంద్రం రాష్ట్రాల‌ను ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరిన‌ట్లు స‌మాచారం. 

విదేశాల్లో ఉన్న‌వారిని భార‌త్‌కు ర‌ప్పించాక‌...తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల రాయ‌బారులు, ప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. వారిని భారత్‌ తీసుకొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాల సీఎంలతో పీఎంవో చర్చించినట్లు తెలిసింది. 

తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాత స్వదేశానికి రావాలనుకుంటున్న భారతీయులందర్నీ తీసుకెళ్తామని, అందుకు కొంత గడువు కావాలని ఇప్పటికే గల్ఫ్‌ దేశాల రాజ కుటుంబాలను ప్రధాని మోదీ వ్యక్తిగతంగా కోరారు. మరోవైపు, విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా ఇటీవల సంప్రదింపులు జరిపారు. 

ఇలా ఉండగా, విదేశాల్లో చిక్కుకుపోయిన లక్షలాది భారతీయులు ఒకే సారి వస్తే.. రాష్ట్రాల్లో సరిపడా వసతులు ఉన్నాయా? లేదా? అని కేంద్రం ఆరా తీస్తోంది. అంతర్జాతీయ కనెక్టివిటీ అంతగాలేని ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ప్రవాసులు ఇతర రాష్ట్రాల్లో దిగితే.. స్వస్థలాలకు వెళ్లిన తర్వాత వారిని క్వారంటైన్‌లో ఉంచాలా? లేదా విమానాశ్రయాల సమీపంలోనే ఉంచాలా? అని సమాలోచనలు జరుపుతోంది.

గల్ఫ్‌ దేశాల నుంచే లక్ష మంది కేరళీయులు తిరిగొచ్చే అవకాశం ఉండగా, ఇందుకు తగ్గట్లుగా అక్కడ క్వారంటైన్లు లేవని తెలుస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే.. గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రి ఉన్నా 3 విమానాల ప్రయాణికులతోనే అది నిండిపోయే అ వకాశం ఉంది. ఇతర క్వారంటైన్‌ సెంటర్ల వివరాలతోపాటు పొరుగు రాష్ట్రాల ప్రయాణికులు హైదరాబాద్‌లో దిగితే.. రాష్ట్రం భరించగలుగుతుందా అని కేంద్రం ఆరా తీస్తోంది.

వేలాది మంది ఆంధ్రప్రదేశ్‌ వాసులు కువైత్‌ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ సాధారణంగా చెన్నై ఎయిర్‌పోర్టులో దిగడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు వీరిని చెన్నైలోనే ఉంచాలా? లేదా వారి సొంత గ్రామాలకు తరలించాలా?అనే దానిపై స్పష్టత లేదు. అక్కడి ప్రభుత్వం అమ్నెస్టీ ప్రకటించినా.. ఈ కారణంగానే భారత ఎంబసీ తాత్సారం చేస్తోంది. 

ప్రవాసీ ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటే విశాఖ, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాలు దిగడానికి అనుమతించే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమంటున్నారు. లాక్‌ డౌన్‌కు ముందు చైనా, ఇరాన్‌ నుంచి తీసుకొచ్చిన భారతీయులను రాజస్థాన్‌, హరియాణాలోని సైనిక దళాల ఆస్పత్రుల్లో ఉంచారు. ఇప్పుడు ప్రవాసుల సంఖ్య భారీగా ఉన్నందున రాష్ట్రాల సహకారం అవసరమని కేంద్రం గుర్తించింది.