టాప్ 10 వైరస్ జిల్లాల్లో హైదరాబాద్ 

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న టాప్‌ 10 జిల్లాల్లో హైదరాబాద్‌ ఏడో స్థానంలో ఉంది. శుక్రవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 2.7 శాతం హైదరాబాద్‌కు చెందినవే ఉన్నాయి. 

కరోనా కేసుల లోడ్ ఎక్కువగా ఉన్న 27 జిల్లాల వివరాలను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ముంబైలో 13.8 శాతం, ఢిల్లీలో 11.6 శాతం, అహ్మదాబాద్‌లో 7.7, ఇండోర్‌‌ 4.5, జైపూర్‌‌ 3.8, పుణెలో 3.5, హైదరాబాద్‌ 2.7, సూరత్ 2.2, థానేలో 2 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపారు. 

పాజిటివ్ కేసుల కాంటాక్ట్‌ ట్రేసింగ్, టెస్టింగ్ ద్వారా ఈ జిల్లాల్లో కరోనాను కంట్రోల్ చేయాల్సి ఉందని తెలిపారు. ఇక తెలంగాణలోని కరోనా కేసుల్లో 55.9 శాతం హైదరాబాద్‌‌లోనే ఉన్నాయని అమితాబ్‌‌ కాంత్‌‌ పేర్కొన్నారు. 

మొత్తం 1001 కేసుల్లో దాదాపు 570 కేసులు హైదరాబాద్‌‌లోనే నమోదయ్యాయి. ఆదివారం తెలంగాణలో నమోదైన 11 కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా హైదరాబాద్‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ లాక్‌‌డౌన్ ఉల్లంఘనలు జరుగుతుండడంతో ఓ బృందాన్ని పరిశీలన కోసం పంపింది.