నమ్మిన వారి మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట

నమ్మిన వారి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ద్వజమెత్తారు. ఏలూరులో జరిగిన ప్రజా ఆవేదన సదస్సులో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఎపికి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆయనను అందరూ నమ్మారని, అయితే  నమ్మినవారికి ద్రోహం చేస్తారని మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. 

రిజర్వేషన్ల పేరుతో పలు కులాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన మహిళలకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. మోసపూరిత, వెన్నుపోటు విధానాల వల్ల వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని స్పష్టం చేసారు.

చంద్రబాబు ఆధ్యర్యంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు.  ఏపీలో దోపీడి పాలనకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహించామని చెబుతూ టీడీపీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూ అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలకు కాపలా కాస్తున్న పెద్ద దొంగ చం‍ద్రబాబు నాయుడు అని విమర్శించారు.

ఆయన రాజకీయ జీవితమంతా నమ్మక ద్రోహం, మోసాలతోనే సాగిందని దయ్యబట్టారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, దోపీడీ గురించి వంద పేజీల పుస్తకం రాసినా సరిపోదని ఎద్దేవా చేశారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆవేదన తెలిపేందుకే ఆవేదన ధర్నాను బీజేపీ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ నెల 15న అనంతపురం, 27న విశాఖలో బీజేపీ ఆవేదన ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

ఏపీలో కొంతమంది పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే తెలుగు దొంగల పార్టీ ఉలిక్కిపడిందని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహారావు ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల సమస్యల గురించి ఏనాడు కేబినెట్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయలేదని,  కానీ ఐటీ దాడుల నేపథ్యంలో ఏం చేయాలని మీటింగ్‌ పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

ఈ సందర్భంగా  జరిగిన అత్యవసర సమావేశం మాఫియా మీటింగ్‌లా ఉందని దుయ్యబట్టారు. టీడీపీ అంటే రాజకీయ పార్టీనా లేక మాఫియా పార్టీనా అంటూ ప్రశ్నించారు. అవినీతిలో ప్రపంచంలోనే టీడీపీ అగ్రస్థానంలో ఉందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రా లేక ముఖ్య‘కంత్రి’నా అంటూ ఎగతాళి చేశారు. ఎంత దొరికితే అంత దోచుకుందాం.. దొరక్కుండా పారిపోదాం అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ ‘గత ఎన్నికల్లో అనుభవజ్ఞడని, అభివృద్ది చేస్తారని చంద్రబాబును నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ ఆ నమ్మకాన్ని  ఆయన నిలబెట్టుకోలేకపోయారని ద్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అంటూ ఏపీలో రైతులు అప్పుల్లో కూరుకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం అని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి అధికారంలోకి వచ్చారని చెబుతూ మరి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నిలదీసారు.

నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేయలేదా అని ఆమె ప్రశించారు. ఏపీకి కేంద్రం సహాయ సహకారాలు అందించటం లేదని టీడీపీ విమర్శలు చేయడం దారుణం అని మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే సరైన బుద్ధి చెప్పాలి అంటూ పిలుపునిచ్చారు.