రెండు మూడు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరో రెండుమూడు వారాల్లో ప్రారంభిస్తామని మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్‌ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) పేర్కొంది. 

ఒకవేళ మనుషులపై వ్యాక్సిన్‌ ఔషధ పరీక్షలు (హ్యూమన్‌ ట్రయల్స్‌) విజయవంతమైతే, వచ్చే అక్టోబర్‌ నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.  

ప్రాథమికంగా నెలకు సగటున 50 లక్షల డోసుల వరకు ఉత్పత్తి చేస్తామని, ఆ తర్వాత ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు కోటి డోసుల వరకు పెంచుతామని ఎస్‌ఐఐ సీఈవో అదర్‌ పూనవల్లా వెల్లడించారు. కాగా కరోనా వ్యాక్సిన్‌ రూపకల్పనలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి సీరం పని చేస్తున్నది.