రెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి 

కొన్ని శ‌క్తులు రెచ్చ‌గొట్టి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తుంటాయని, అలాంటి శ‌క్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) సర్ సంఘచాలక్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ పిలుపిచ్చారు. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన నాగ్‌పూర్‌ నుంచి దేశ వ్యపథంగా గల స్వయం సేవకులను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగిస్తూ దేశంలో ఇతరులను రెచ్చగొట్టే వాళ్లకు కొదవేమీ లేదని, ఇందువల్ల ఆవేశకావేశాలు తలెత్తుతాయే త‌ప్ప లాభం ఉండ‌ద‌ని స్పష్టం చేశారు. 

భరతమాతను ముక్కలు చేస్తున్నామంటూ ఒక‌ గ్యాంగ్ ప్రజలను రెచ్చగొడుతూ ఉంటుంద‌ని, ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయమూ ఉంటుంద‌ని మోహ‌న్ భ‌గ‌వత్ హెచ్చరించారు. 

దేశంలో ఉన్న‌ 130 కోట్ల మంది భరతమాత బిడ్డ‌లేన‌ని  స్పష్టం చేస్తూ ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, బాధ్యతగా వ్యవహరించాలని ఆయ‌న‌ కోరారు. 

మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో సాధువుల హత్యలను ప్రస్తావిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని చెప్పారు. పరిస్థితులు చేయి దాటిపోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 16నాటి ఘటనలో హత్యకు గురైన ఇద్దరు సాధువులకు (కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్‌) ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

సాధువులకు నివాళి అర్పించేందుకు విశ్వహిందూ పరిషత్ నేతృత్వంలో శ్రద్ధాంజలి కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిన ప్రజారోగ్య ఆంక్షలను ఉల్లంఘించే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఈ వైరస్ కట్టడికి ప్రజలంతా ప్రభుత్వం సూచించిన నీయమాలను ఖచ్చితంగా పాటించాలని భాగవత్ కోరారు. 

 కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్ఎస్ఎస్ శిక్షణా కార్యక్రమాలు అన్నింటిని జూన్ ఆఖరు వరకు నిలిపి వేశామని గుర్తు చేశారు. అయితే సంఘ్ కార్యక్రమాలు అన్నింటిని నిలిపివేసిన్నట్లు  కాదని,ఇళ్లల్లో ఉంటూనే, జాగ్రత్తలు తీసుకొంటూనే అవసరమైన వారికి సహకారం అందించాలని ఆయన పిలుపిచ్చారు. 

"నీ సొంత ప్రయత్నాల ద్వారా సమాజానికి మేలు చేకూర్చడం మీ బాధ్యత. ఆత్మగౌరవంతో, దాతృత్వ భావనతో సమాజానికి హితం చేకూర్చడం కూడా సంఘ్ కార్యక్రమాలో భాగమే. కేవలం సంఘం కోసం కాకుండా సమాజం గురించి కృషి చేయాలి"  అంటూ హితవు చెప్పారు. 

ఈ క్లిష్ట సమయంలో మనం పేరు ప్రతిష్టలకు పనిచేయడం లేదని చెబుతూ ఈ సమాజం మనది కావడంతో సమాజానికి మనం చేయవలసిన కృషి చేయవలసిందే అని స్పష్టం చేశారు. "మనం అహంకారాన్ని విడనాడి, ఎటువంటి ప్రతిఫలం, పేరు ప్రతిష్టలు  ఆశింపకుండా పనిచేయగలగాలి" అంటూ స్వయంసేవక్ లకు సూచించారు.