అరబ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వారిని కాపాడండి 

అరబ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన కార్మికులను స్వదేశానికి తీసుకురావడానికి, అరబ్ దేశాలకు ప్రత్యేక విమానాలను పంపే ప్రయత్నాలను వేగవంతం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు వ్రాసిన లేఖలో అరబ్ దేశాలలో, ముఖ్యంగా దుబాయ్, సౌదీ అరేబియా, అబుదాబిలలో చిక్కుకుపోయిన తెలంగాణకు చెందిన వందలాది మంది కార్మికుల దుస్థితిని ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. 

అజ్మాన్ లోని అజ్మాన్ జుర్ఫ్-3 లోని బెల్హానా కార్మిక శిబిరంలో ఉన్న కార్మికుల సమస్యల గురించి వచ్చిన ఒక వార్త ఏకధానాన్ని ఆయన ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణతో పాటు సమీప నియోజకవర్గాలకు చెందిన చాలామంది అరబ్ దేశాలకు భారీ సంఖ్యలో వలస వెళ్లారని, అక్కడ వివిధ స్థాయిలలో పనిచేస్తున్నారని సంజయ్ తెలిపారు. 

వారిలో అత్యధికులు కూలి పనులు చేస్తున్నారని అంటూ ఈ వలసకు నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉందని చెప్పుకొచ్చారు. కరోనా వ్యాధి వ్యాప్తి తరువాత, లాక్ డౌన్ ప్రకటించిన కారణంగా, అక్కడ ఎక్కువ మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారని  లేదా పని లేకుండా ఖాళీగా ఉన్నారని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటన తర్వాత మార్చి 22 నుండి అంతర్జాతీయ విమానాల నిషేధం పర్యవసానంగా, వారు భారతదేశానికి తిరిగి రాలేకపోయారని సంజయ్ పేర్కొన్నారు.  అక్కడ నెలకొన్న దారుణమైన పరిస్థితుల గురించి బాధపడుతూ,  చిక్కుకున్న ప్రజలు , చాలా మంది ఫోన్ చేసి, బాధ పడ్డారని వివరించారు. 

పైగా, వారిలో కొందరికీ కరోనా (సుమారు 12 మంది) ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. నివాసయోగ్యం కానీ, ప్రదేశాలలో కార్మికులను ఉంచడంతో, వారి పరిస్థితి దయనీయంగా ఉందని సంజయ్ ఆవేధన వ్యక్తం చేశారు. 

కరోనా వ్యాధి వ్యాప్తి తీవ్రత బట్టి, అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభం కావడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు కాబట్టి, ఈ పరిస్థితులలో, అరబ్ దేశాల్లో చిక్కుకున్న కార్మికులను, స్వదేశానికి తీసుకువచ్చే మార్గాలను అన్వేషించి, వారిని త్వరగా తిరిగి తీసుకువచ్చేలా వ్యూహాన్ని రూపొందించాలని ఆయన విదేశాంగ మంత్రిని కోరారు. 

అంతేకాకుండా, భారతదేశంలోని ముస్లింల పట్ల శత్రుత్వం ఉందని ఆరోపిస్తూ ఆర్గనైజేషన్ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ నిరాధారమైన ప్రకటన విడుదల చేయడం పట్ల సంజయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన అరబ్ దేశాల్లో ఉన్న కార్మికుల జీవితాలను మరింత ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.