మే 3 తర్వాత మహారాష్ట్రలో సడలింపులు 

మే 3 తర్వాత మహారాష్ట్రలో లాక్ డౌన్ కు సంబంధించి జిల్లాల్లో సడలింపులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే తెలిపారు. సరిహద్దులు తెరవకుండా జిల్లా పరిధిలోనే కార్యకలాపాలు సాగే విధంగా నిబంధనలు సడలించాలని ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. 

వలస కూలీలు ఎక్కడ గుమ్మిగూడ వద్దని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ను అందరూ కచ్చితంగా పాటిస్తేనే కరోనాను అడ్డుకోవచ్చుని స్పష్టం చేశారు. ప్రస్తుత సమయంలో  రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని, వలస కార్మికుల గురించి కేంద్రంతో చర్చిస్తున్నామని, వీలైనంత త్వరలో ఒక పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. 

మహాహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ వస్తుందని థాక్రే చెప్పారు. లక్షణాలు కనిపించి టెస్టులు చేయించుకోని వారు ఉంటే బయటకు వచ్చి టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 

కరోనాతో  ఇద్దరు పోలీసులు చనిపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. వచ్చే మూడు నాలుగు నెలలు చాలా ముఖ్యం అని చెబుతూ డాక్టర్లు క్లీనిక్‌లు స్టార్ట్‌ చేయాలని, డయాలసిస్‌ సెంటర్లు కూడా తెరుచుకోవచ్చాని తెలిపారు. 

ఈ నెల 30 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చిస్తున్నామని చెబుతూ కొన్ని సడలింపులు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల బాధ్యత తనపై ఉందని, ఇది సహనానికి పరీక్ష అని ఉద్ధవ్‌ థాక్రే  పేర్కొన్నారు. 

అందరం కలిసి వైరస్‌ను పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపిచ్చారు. మన దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 7628 కేసులు నమోదు కాగా..వాటిలో అత్యధిక కేసులు ముంబైలోనే ఉన్నాయి. 323 మంది మృతి చెందారు.