విజయవాడ కృష్ణలంకలో ఒకేసారి వైరస్ ఉధృతి 

విజయవాడలోని కృష్ణ లంకలో ఒక్కసారిగా  కరోనా మహమ్మారి ఒక్కసారిగా ఉధృత రూపం దాల్చడంతో అధికార యంత్రాంగం ఖంగు తిన్నది.  మూడు రోజుల్లోనే 87 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆదివారం నాటికి మొత్తం కేసులు 157కు చేరుకున్నాయి. దీంతో కృష్ణా జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 179కు చేరింది. 

గురువారం వరకు విజయవాడ నగరంలో సింగల్‌ డిజిట్‌లోనే కేసులు నమోదవుతుండగా, శుక్రవారం నుండి ఈ పరిస్థితి ఒక్కసారి మారింది. శుక్రవారం 14 కేసులు నమోదుకాగా, శనివారం 21 కేసులు, ఆదివారం కృష్ణ జిల్లాలో  52 కేసులు  వెలుగులోకి వచ్చాయి. వీటిలోకూడా అత్యధికం కృష్ణలంక ప్రాంతానికి చెందినవే కావడం గమనార్హం. 

ఇక్కడ శనివారం 18 కేసులు నమోదుకాగా, శుక్రవారం ఏడు కేసులు వచ్చాయి. దీంతో ఒక్క కృష్ణలంక ప్రాంతంలోనే గడిచిన రెండు రోజుల్లో 25 కేసులు వెలుగులోకి వచ్చినట్టైంది. ఒక్కసారిగా ఇన్ని కేసులు రావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం కూడా ఉలికిపడింది.

పాజిటివ్‌గా నిర్థారణయైన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగమయ్యారు. ఈ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. కృష్ణలంకకు చెందిన ఒక లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యహరించడంతో ఆయన నుండి ఇతరులకు పెద్ద ఎత్తున వ్యాపించినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. 

ఆ వ్యక్తి లారీలో ఇటీవల ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించ లేదు. లాక్‌డౌన్‌ కావడంతో చుేట్టుపక్కల వారితో కలిసి టైంపాస్‌ కోసం పేకాట ఆడాడు. ఆ కుటుంబాల్లోని మహిళలు అందరు హౌసీ ఆడారు. దీంతో వారందరూ వైరస్‌ బారిన పడ్డట్టు అధికారులు తేల్చారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు కర్నూలు, గుంటూరు నగరాల్లో మాత్రమే వంద పాజిటివ్‌ కేసులు దాటగా, తాజాగా విజయవాడ కూడా ఆ జాబితాలో చేరింది.  కృష్ణలంక ప్రాంతాన్ని పోలీసులు పూర్తి ఆధీనంలోకి తీసుకున్నారు. 200 మందికి పైగా హోం క్వారంటైన్‌లో ఉంచారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏపీలో  రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 81 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,097కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 279, గుంటూరులో 214 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 835గా ఉంది. 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.