పాక్ లో కరోనా హాట్‌స్టాట్‌లుగా మసీదులు 

కరోనా వ్యాప్తి చెందడానికి మసీదులే హాట్‌స్టాట్‌లుగా మారుతున్నాయని పాకిస్తాన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఇఫ్తికార్ బర్నీ హెచ్చరించారు. ప్రజలందరూ రంజాన్ ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లో మసీదులకు వెళ్లవద్దని ఆయన కోరారు. 

దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్‌లో మొదటి 6000 కరోనా కేసులు నమోదవడానికి దాదాపు నెల పట్టిందని, కానీ ఆ సంఖ్య కేవలం 6 రోజుల్లో 12వేలకు చేరిందని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే రెండు నెలల్లో కరోనా ఊహించని రీతిలో విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో దేశంలోని మసీదు పెద్దలందరికీ పాకిస్తాన్ రాష్ట్రపతి ఆరీఫ్ ఆల్వీ ఓ లేఖ రాశారు. 50 ఏళ్లు పైబడిన వారిని మసీదులలోనికి అనుమతించవద్దని, వారిని ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకునేలా సూచించమని మసీదు పెద్దలను తన లేఖ ద్వారా కోరారు. 

మరోవంక కరోనా కట్టడిలో ముందుండే డాక్టర్లు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు తమకు అవసరమైన వ్యక్తిగత పరిరక్షక పరికరాలు లేవని అంటూ పంజాబ్ తదితర చోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 160 మంది డాక్టర్లు, ఇతర వైద్య సంబంధీకులకు కరోనా వైరస్ కీర్తించినట్లు తెలుస్తున్నది. ముగ్గురు డాక్టర్లు ఈ వైరస్ తో మృతి చెందిన్నట్లు తెలుస్తున్నది. 

ఇదిలా ఉంటే కేవలం 12 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్‌లో 783 కోవిడ్-19 కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలుపుకొని ఈ రోజు మధ్యాహ్నానికి పాకిస్తాన్‌లో మొత్తం 12,579 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కనీసం 15 మంది కరోనా కారణంగా మరణించారని చెబుతున్నారు. 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 269కి చేరిందని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యధికంగా పంజాబ్ ప్రావిన్స్‌లో 5,378 కరోనా కేసులు నమోదుకాగా, సింధ్ ప్రావిన్స్‌లో 4,232, ఖైబర్ పంక్తుంఖ్వాలో 1,793, బలూచిస్తాన్‌లో 722, గిల్జిత్ బాల్టిస్తాన్‌లో 308, ఇస్లామాబాద్‌లో 235,  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.