ప్ర‌తి పౌరుడు సైనికుడిలా పోరాడుతున్నారు

క‌రోనా వైర‌స్‌పై భార‌త్‌లో జ‌రుగుతున్న‌ది ప్ర‌జాపోరాటం అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇవాళ మ‌న్‌కీ బాత్‌లో మాట్లాడుతూ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాధికారులు క‌లిసికట్టుగా వైర‌స్‌పై పోరాడుతున్న‌ట్లు కొనియాడారు. తెలిపారు. ప్ర‌తి ఒక పౌరుడు.. సైనికుడిలా వైర‌స్‌ఫై యుద్ధం చేస్తున్నారని ప్రశంసించారు. 

క‌రోనా సంక్షోభ వేళ రైతులు మాత్రం నిర్విరామంగా ప‌నిచేస్తున్నార‌ని గుర్తు చేశారు.  ఎవ‌రు కూడా ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు రైతులు శ్ర‌మిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ వారి వారి సామ‌ర్థ్యానికి త‌గిన‌ట్లు పోరాడుతున్నారని మెచ్చుకున్నారు. 

 కొంద‌రు ఇంటి కిరాయిల‌ను మాఫీ చేస్తున్నార‌ని,  క్వారెంటైన్‌లో ఉన్న వాళ్లు స్కూళ్ల‌కు రంగ‌లు అతున్నార‌ని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్ వారియ‌ర్స్ అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేశామ‌ని, ఎన్జీవోలు, స్థానిక ప్ర‌భుత్వాలు దాంట్లో భాగ‌మైన‌ట్లు చెప్పారు. 

డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఎన్‌సీసీ క్యాడెట్లు కూడా దాంట్లో జ‌త‌క‌లిశార‌ని పేర్కొన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్ర‌తి శాఖ‌, సంస్థ‌లు అన్నీ.. వీలైనంత త్వ‌ర‌గా కోలుకునేందుకు క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. 

ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం మ‌న జీవితాల్లో భాగ‌మైన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  మాస్క్‌లు ధ‌రించిన వారిని రోగులుగా చూడ‌కూడ‌ద‌ని, నాగ‌రిక స‌మాజానికి మాస్క్‌లు చిహ్నంగా మారాయ‌ని గుర్తు చేశారు. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాల‌న్నా, లేక ఇత‌రుల్ని వ్యాధి నుంచి కాపాడాల‌న్నా.. మాస్క్‌లు ధ‌రించ‌డం చాలా ముఖ్య‌మని ప్రధాని స్పష్టం చేశారు. 

 బ‌హిరంగ స్థ‌లాల్లో ఉమ్మివేస్తే క‌లిగే అన‌ర్ధాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని మోదీ చెప్పారు. ఇలాంటి అల‌వాటును ఆపాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌ని ప్రధాని హితవు చెప్పారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉమ్మివేసే అల‌వాటును మానేసే త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని పేర్కొన్నారు. కోవిడ్‌19 మ‌హమ్మారిని అరిక‌ట్ట‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు చూపిన చొర‌వ‌ను ప్ర‌ధాని మెచ్చుకున్నారు.    

ఈ రంజాన్ వేళ‌.. గ‌తంలో క‌న్నా ఎక్కువ‌గా  ప్రార్థించాల‌ని కోరుతూ  ఈద్ క‌న్నా ముందే ఈ ప్ర‌పంచం నుంచి క‌రోనా వెళ్లే రీతిలో ప్రార్థ‌న‌లు చేయాలని సూచించారు.  స్థానిక ప్ర‌భుత్వాలు ఇచ్చిన ఆదేశాల ప్ర‌కారం.. క‌రోనాపై పోరాటంలో పాల్గొంటార‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. కోవిడ్‌19 వ‌ల్ల పండుగ‌లు జరుపుకొనే విధాన‌మే మారింద‌ని చెబుతూ ఈస్ట‌ర్ పండుగ‌‌ను క్రైస్త‌వులు ఇండ్ల‌లోనే చేసుకున్నార‌ని ప్రధాని గుర్తు చేశారు. ఇలాంటి చ‌ర్య‌లే కోవిడ్‌ను నియంత్రించ‌గ‌ల‌వని చెప్పారు.  

వైద్య సిబ్బందిపై దాడి చేస్తే క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేసే విధంగా కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఆ ఆర్డినెన్స్‌పై వైద్య బృందం నుంచి సంతృప్తివ్య‌క్త‌మైన‌ట్లు చెప్పారు. డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది ర‌క్ష‌ణ కోసం ఆ ఆర్డినెన్స్ త‌ప్ప‌నిస‌రి అయ్యింద‌ని పేర్కొన్నారు.