కరోనా స్వావలంబన మార్గాన్నిచూపింది   

కరోనా భారత్ కు స్వావలంబన మార్గాన్ని నేర్పించిందని  చీఫ్ ఆఫ్​డిఫెన్స్ స్టాఫ్ ​(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. భారత్ లో తయారీ  ఆవశ్యకతను, ప్రాంతీయ పరాక్రమాన్ని ఎలా బలోపేతం చేయడం లాంటి విషయాలను ఎత్తిచూపిందని పేర్కొన్నారు.   

 కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు చేస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే.. కరోనా లక్షణాలు కలిగిన వారిని గుర్తించడం తమకు సులువవుతుందని రావత్ సూచించారు. 

‘ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు పాటించాలి. అప్పుడే కరోనాపై విజయం సాధించగలం. భారత్  ఇతరులకు సాయం చేసేలా ఉండాలి గానీ సాయం కోసం ఇతరులను అర్థించే స్థితిలో ఉండొద్దు' అని స్పష్టం చేశారు. 

కేబినెట్ కార్యదర్శులు సమావేశాలు నిర్వహిస్తున్నారని, త్రివిధ దళాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నదని వివరించారు. త్రివిధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ తో రక్షణ శాఖ మంత్రి కూడా మాట్లాడారని, సైనిక సన్నాహాలు గురించి అడిగి తెలుసుకున్నారని గుర్తు చేశారు. 

మన జవాన్లు దేశ సరిహద్దులలోనే ఉన్నరని తెలుపుతూ, వాళ్లలో ఒక్కరికీ కరోనా సోకలేదని రావత్ స్పష్టం చేసారు. నేవల్ షిప్స్, సబ్ మెరైన్స్ తోపాటు ఎయిర్ ఫోర్స్ లో కూడా ఎవరికీ కరోనా సోకలేదని పేర్కొన్నారు.