పాతబస్తీలో పోలీసులపై పోకిరీల దాడి 

మొత్తం తెలంగాణలోనే కరోనా ఉధృతికి అడ్డులేకుండా పోతున్న  పాతబస్తీలో అరాచక పరిష్టితులు నెలకోవడం పట్ల ఆ ప్రాంత ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. రోడ్లపై ఇష్టానుసారంగా జనం తిరుగుతూ ఉన్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తున్నది. బయటకు రావద్దని హెచ్చరిస్తున్న పోలీసులపై కొంతమంది పోకిరీలు జులం చేస్తున్నారు. 

రాజకీయ ప్రాపకంతో పాతబస్తీ తమ  సొంతమంటూ లాక్‌డౌన్ నిబంధనలు ధిక్కరిస్తున్నా అధికార యంత్రాంగం ఏమీ చేయలేక పోతున్నది. హోమ్ శాఖను నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి పాత బస్తీలో నివాసం ఉంటున్నా ఇటువంటి ఉల్లంఘనలపై నిస్సహాయంగా మిగలవలసి వస్తున్నది. 

ఇప్పటి వరకు నగరంలో 480 వరకు కేసులు నమోదుగా అత్యధిక కేసులు పాతబస్తీ ప్రాంతాలకు చెందినవే. జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్యశాఖ అధికారులు కంటైన్‌మెంట్ జోన్లలో నివసించే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా, ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలని ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. రోడ్లపై ద్విచక్ర వాహనాలతో యధేచ్చగా చక్కర్లు కొడుతున్నారు.

రేషన్‌బియ్యం, నగదు రూ.1500లు, జన్‌ధన్ ఖాతా డబ్బులు, నిత్యావసర సరుకుల పేరుతో సామాజిక దూరంగా పాటించకుండా గుంపులు గుంపులుగా ఒకే దగ్గర చేరుతున్నారు. ఈవిధంగా చేస్తుంటే  కరోనా వైరస్ మిగతా వారిని వస్తుందని స్థానిక అధికారులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. పైగా ఆ విధంగా వారించినా అధికారులపైననే తిరుగుబాటు చేస్తున్నారు. 

బేగంబజార్ ప్రాంతంలో ఉదయం 8గంటల తరువాత ఖర్జురా గల్లీకి పెద్ద ఎత్తున వస్తూ మధ్యాహ్నం 12గంటల వరకు అక్కడే తిష్టవేస్తూ సరుకుల కొనుగోలు చేస్తున్నామంటూ కనీసం మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా దుకాణాల ముందుకు హంగామా చేస్తున్నారు. 

మర్కజ్ వెళ్లిన వారు 420 మంది వరకు ఈప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. చార్మినార్ యునానీ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు అందిస్తున్నప్పటికీ వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా స్థానికులు  ఆసుపత్రికి రాకుండా చుట్టుపక్కల వారిని భయాందోళనలకు గురిస్తున్నట్లు పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు. 

తాము వెళ్లి బలవంతంగా తీసుకొస్తే తప్ప ఎవరు వైద్యపరీక్షలకు ముందుకు రావడం లేదని, తక్కువ సంఖ్యలో ప్రభుత్వం సిబ్బంది వెళ్లితే బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీస్ అధికారులు వాపోతున్నారు. 

పాతబస్తీ కాకుండా మిగతా ప్రాంతాల్లో కేసులు తక్కువగా ఉన్నా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వాధికారులు సహకరిస్తున్నారని, సమస్యంతా పాతబస్తీ మర్కజ్ బాధితులతో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.