వంద రోజులలో తగ్గుముఖం పట్టిన కరోనా ఉధృతి 

దేశంలో కరోనా వైరస్ ప్రవేశించి 100 రోజులు గడిచింది. ఈ సందర్భంగా దేశంలో ఈ వైరస్ ఉదృతి తగ్గుముఖం పట్టడం, మరో వంక వైద్యపరంగా మౌలిక సదుపాయాలు, పరికరాలు తగురీతిలో అందుబాటులోకి రావడంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సంసిద్ధత వ్యక్తం అవుతున్నది. 

దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు సగటున 9.1 రోజులకు రెట్టింపు అవుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొత్త కేసుల వృద్ధిరేటు 6 శాతంగా ఉంది. గత వంద రోజులలో రోజువారీ వృద్ధిరేటు ఇంత తక్కువగా ఉండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో అత్యున్నత మంత్రివర్గ కమిటీ (జీవోఎం) సమావేశమై రాష్ట్రాల వారీగా కరోనా దవాఖానలు, ఐసొలేషన్‌ బెడ్‌లు, వార్డులు, పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్క్‌లు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు ఇతర సదుపాయాలపై సమీక్షా జరిపి సంతృప్తి వ్యక్తం చేసింది. దేశీయ తయారీ సంస్థలు ఇప్పటికీ పీపీఈ కిట్లు, మాస్క్‌లను తయారీచేస్తున్నాయి. ప్రస్తుతం అవి సరిపడా అందుబాటులో ఉన్నాయి.. 

‘ప్రస్తుతం దేశంలో రోజుకు లక్షకుపైగా పీపీఈ కిట్లు, మాస్క్‌లు తయారవుతున్నాయి. 104 సంస్థలు పీపీఈ కిట్లను, మూడు సంస్థలు ఎన్‌95 మాస్క్‌లను తయారుచేస్తున్నాయి. దేశీయ సంస్థలు ఇప్పటికే వెంటిలేటర్ల తయారీని ప్రారంభించాయి. 59,000 యూనిట్ల తయారీకి ఆరు సంస్థలకు ఆర్డర్లు ఇచ్చాం’ అని కేంద్ర వైద్య శాఖ  తెలిపింది. 

ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 3.1 శాతం ఉండగా, రికవరీ రేటు 20 శాతానికిపైగా ఉన్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. లాక్‌డౌన్‌తోపాటు క్లస్టర్‌ మేనేజ్‌మెంట్‌, కంటైన్మెంట్‌ స్ట్రాటజీ వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు తెలిపింది.

 దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,283కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 19,519.  కోవిడ్‌-19 వ్యాధి కారణంగా ఇప్పటివరకు 825 మంది చనిపోయారు. వ్యాధి నుంచి 5,939 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 

మహారాష్ట్రలో అత్యధికంగా 7,628 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1076 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అదే గుజరాత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3071కు చేరుకుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,625గా నమోదైంది.