ఉద్యోగుల కోత లేకుండా కేంద్రం యత్నం 

సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించి తద్వారా ఉద్యోగాలను రక్షించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. కరోనా వైరస్‌ కట్టడికి అమలవుతున్న లాక్‌డౌన్‌.. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని చాలా కంపెనీలను ప్రభావితం చేస్తున్నది. దీంతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆయా సంస్థలు ఉద్యోగుల తొలగింపుల దిశగా అడుగులు వేస్తున్నాయి. 

అయితే వివిధ పొదుపు చర్యలతో ఉద్యోగుల కోతకు వెళ్లకుండా కంపెనీలను అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తున్నది. బోనస్‌ చెల్లింపుల నిలుపుదల, కనీస వేతనాల్లో పెంపు వాయిదా, ఓవర్‌టైమ్‌ (ఓటీ) చెల్లింపుల్లో తగ్గింపు, పని వేళల కుదింపు వంటి చర్యలను ఏడాదికాలం చేపట్టాలని కేంద్రం అన్ని సంస్థలకు సూచనలు ఇవ్వనుందని ఓ అధికారి చెప్తున్నారు. 

ఇందుకు అనుగుణంగా నోటీసులు ఇవ్వడం, బోనస్‌ చెల్లింపుల చట్టం-1965తోపాటు మరికొన్ని చట్టాల్లో తాత్కాలిక సవరణలు చేయనున్నట్లుతెలిసింది. బోనస్‌ చట్టం ప్రకారం లాభాలు, ఉత్పత్తి ఆధారంగా ఉద్యోగులకు ఏటా 8.33 శాతం బోనస్‌లను కంపెనీ యాజమాన్యాలు ఇవ్వాలి. 

వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా కనీస వేతనాలను 8-12 శాతం పెంచాలి. అయితే ఇలాంటి ప్రోత్సాహకాలన్నింటికీ కొంత విరామం ఇవ్వాలని ప్రభుత్వం సంస్థలకు చెప్పనున్నది. ఇదే జరిగితే ఈ కష్టకాలంలో సంఘటిత రంగంలోని చాలా సంస్థలకు గొప్ప ఉపశమనం లభించినట్లేనని భావిస్తున్నారు. 

దేశంలోని 50 కోట్ల కార్మిక శక్తిలో 10 శాతం సంఘటిత రంగంలోనే ఉన్నది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు పెద్ద ఎత్తున ఊరట దక్కనున్నది. ప్రభుత్వ ఆలోచనలకు భారతీయ సిబ్బంది సమాఖ్య అధ్యక్షుడు లోహిత్‌ భాటియా సైతం మద్దతు పలుకుతున్నారు.