విశాఖలో మే 31 దాకా భూలావాదేవీలు జరపకండి 

ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాపించి, లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఇవేమీ పట్టించుకోకుండా విశాఖపట్నంకు రాజధాని తరలింపు కోసం అక్కడ భూసేకరణ జరపడానికి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమగ్నమై ఉండడం పట్ల బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్యెల్సీకి పివి మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. 

విశాఖలోని భూములను కరోనాను, హైకోర్టు ఉత్తర్వులను ప్రక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో మే 31వ తేదీ వరకు భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపకూడదని మాధవ్ హెచ్చరించారు.

రాజకీయ జోక్యం కారణంగా కరోనా కట్టడిలో అధికారులు సమర్ధవంతంగా పనిచేయలేక పోతున్నారని చెబుతూ కరోనాకు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.   

తీవ్రమైన రాజకీయ వత్తిడుల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ అధికారులు  కరోనా నియంత్రణలో తమ బాధ్యతలను నిస్పక్షపాతంగా నిర్వహింపలేక పోతున్నారని సీనియర్ బిజెపి నేత, పార్టీ ఎమ్యెల్సీ పివి మాధవ్ ఆరోపించారు. అధికార పక్షం నేతల నుండి వస్తున్న వత్తిడుల కారణంగా వారు `కీలు బొమ్మలు'గా వ్యవహరింప వలసి వస్తున్నదని ధ్వజమెత్తారు. 

పొరుగున ఉన్న నగరం కర్నూల్ కు వెళ్లిన బిజెపి నేత విష్ణు వర్ధన్ రెడ్డిని గృహనిర్బంధం కావించిన అధికారులు విచ్చలవిడిగా తిరుగుతున్న వైసిపి ఎంపీ, ఎమ్యెల్యేలను ఎందుకని కట్టడి చేయలేక పోతున్నారని మాధవ్ ప్రశ్నించారు. 

అధికార పక్షానికి చెందిన నాయకులు లాక్ డౌన్ ను ఉల్లంఘించడంతో పాటు సాంఘిక దూరం  పాటించకుండా, మాస్క్ లు లేకుండా, గుంపులుగా తిరుగుతున్నా అధికారులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. 

 కాగా, తమ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా   లక్ష్మీనారాయణపై   వైసిపి ఎంపీ  విజయసాయిరెడ్డి చేసిన అసందర్భపు ఆరోపణలపై కోర్ట్ కు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు  తెలిపారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా చిక్కుకు పోయిన మత్స్యకారులను వారి ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మాధవ్ తెలిపారు.