ఏపీలో వెయ్యి దాటిన కరోనా  కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1016కు చేరింది. 

24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు మరణించారు. ఇవాళ కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు కరోనా ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 31 కి పెరిగింది. ఇప్పటి వరకు ఏపీలో 171 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  

అనూహ్యంగాఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు లేని శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో కొత్తగా 3 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.   

కర్నూల్ జిల్లాల్లో కేసుల సంఖ్య 275కు పెరగగా, గుంటూరు జిల్లాలో 209కు, కృష్ణా జిల్లాలో 127కు పెరిగాయి.