హైదరాబాద్ లో అదుపులో లేని వైరస్.. కేంద్రం బృందం 

హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా పాత బస్తీలో కరోనా వైరస్ కట్టడి కాకపోవడం, ప్రతి రోజూ కేసులు పెరుగుతూ ఉండడం, లాక్‌డౌన్‌ సక్రమంగా అమలు కావడం లేదని వస్తున్న ఫిర్యాదులపై కేంద్రం సీరియస్ అయింది. మరో మూడు నగరాలతో పాటు హైదరాబాద్ కు కూడా కేంద్ర బృందం పంపుతున్నట్లు ప్రకటించింది. 

అహ్మ‌దాబాద్‌, సూర‌త్‌, చెన్నై లతో పాటు హైదరాబాద్ కు కూడా కేంద్ర ప్రభుత్వం అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందాన్ని (ఐఎంసీటీ) పంపుతున్నారు.  ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేస్తుంది. 

ముఖ్యంగా.. లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలు, నిత్యావసర సరుకుల సరఫరా, సామాజిక దూరం పాటిస్తున్నారా లేదా?, వైద్య సదుపాయాల సన్నద్ధత, వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ, పేద ప్రజలు, కార్మికులకు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పరిస్థితి.. తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది. 

హైదరాబాద్ లో కేవలం 45 కుటుంబాలు 260 మందికి ఈ వైరస్ ను సోకేటట్లు చేశాయని స్వయంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ మొత్తం మీద  కరోనా కేసుల సంఖ్య 983కు చేరుకోగా, వాటిల్లో దాదాపు సగం కేసులు కేవలం 113 కుటుంబాల నుంచే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

 గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 485 కేసులు నమోదు కాగా,  ఆ 45 కుటుంబాల నుంచి వచ్చిన పాజిటివ్‌ల సంఖ్య 268గా ఉంది. అంటే మొత్తం హైదరాబాద్ నగరంలోని కేసులలో నాలుగోవంతు ఉందన్నమాట.  ఇంకా మర్కజ్ జమాత్ సమావేశాల నుండి తిరిగి వచ్చిన వారందరి ఆచూకీ లభించలేదని గత వారం ఆరోగ్య మంత్రి రాజేందర్ పేర్కొనడం గమనార్హం. 

ఈ కుటుంబాల్లో కొందరికి ముందుగానే  కరోనా లక్షణాలు కనిపించినా వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులకు వైరస్‌ వ్యాప్తిచెందిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో అయితే.. రోజూ పదికి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.  గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం మీద కరోనా కట్టడి అవుతున్నా పాత బస్తీలో మాత్రం  తగ్గక పోవడం   అధికారులలో ఆందోళన కలిగిస్తున్నది.  పాతబస్తీలో   స్థానికుల సహాయ నిరాకరణతో పాటు రాజకీయ  వత్తిడుల కారణంగా అధికారులు సహితం కఠినంగా వ్యవహరింపలేక పోతున్నట్లు తేలుతున్నది. 

పాత బస్తీలో నాలుగైదు కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి అధికారులు చేతులు దులుపుకున్నట్లు కనిపిస్తున్నది. బారికేడ్లు ఏర్పాటు చేసినా  వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కనీస చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు  చెలరేగుతున్నాయి.  పాతబస్తీలోని చాలా హాట్ స్పాట్ ప్రాంతాలలో ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నది. 

ఈ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ,  శానిటైజేషన్‌, ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు  తగు దృష్టి సారింపలేక పోతున్నారు.  కొన్ని హాట్ స్పాట్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు యధేచ్చగా సాగుతున్నా పోలీసులు రాజకీయ కారణాలతో పట్టించుకోలేక పోతున్నారు. ప్రాంతాల వారీగా వివిధ విభాగాలతో నోడల్‌ అధికారులు,  ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు.