శ్రీకాళహస్తిని కాటేస్తున్న కరోనా 

ప్రశాంతతకు పేరొందిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఇప్పుడు కరోనా వైరస్ కాటేస్తున్నది. కేవలం అధికారుల నిలువెత్తు నిర్లక్ష్య ధోరణి కారణంగా మొత్తం పట్టణము రెడ్ జోన్ గా మారింది. కేవలం 85,000 జనాభా గల ఈ చిన్న పట్టణంలో ఇప్పుడు పాజిటివ్ కేసులు 50కు చేరుకున్నాయి.  

చిత్తూర్ జిల్లాలో మొత్తం  73 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వాటిలో 50 శ్రీకాళహస్తి కేంద్రంగానే నమోదయ్యాయి. ఈ పట్టణానికి మార్చి 12 తర్వాత లండన్‌, ఢిల్లీ, చెన్నైల నుంచి 15 మంది రాగా వారిలో నలుగురికి వైరస్‌ సోకింది. అయితే వీరి ద్వారా 46 మంది ఇతరులకు వైరస్‌ వ్యాపించింది. 

వారిలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక వలంటీరు ఉండడంతో కరోనా విధులంటేనే ప్రభుత్వ ఉద్యోగులందరూ భయపడిపోతున్నారు. . శ్రీకాళహస్తి పట్టణం నుంచే కాళహస్తి, తొట్టంబేడు, వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ, ఏర్పేడు మండలాలకు, పుత్తూరు పట్టణానికీ కరోనా వ్యాపించింది. 

లాక్‌డౌన్‌  అమలులో తొలినుండి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. స్థానిక ఎమ్యెల్యే ఆధ్వర్యంలో సహాయం పేరుతో భారీ జాతరలు జరుపుతున్నా అధికారుల ప్రేక్షక పాత్ర వహించారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలిరోజే జిల్లాలోనే మొదటి కరోనా పాజిటివ్‌ కేసు శ్రీకాళహస్తిలో నమోదైంది. 

లండన్‌ నుంచి మార్చి 18న శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడొకరు 23న అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి కరోనా వైరస్‌ సోకినట్లు 25న వెల్లడైంది. అప్పటికే అతను కుటుంబంతో, బంధుమిత్రులతో గడిపాడు. ఊరి బయట దాబాలకు వెళ్లాడు.

ఆ యువకుడిని, కుటుంబసభ్యులను మాత్రమే క్వారంటైన్‌కు తరలించిన అధికారులు, అతడి ఇంటికి రాకపోకలు సాగించిన ఇరుగుపొరుగువారిని, స్నేహితులను విస్మరించారు. దానితో భారీ మూల్యం చెల్లింపవలసి వచ్చింది. 

నెల తర్వాత అతడి ఇరుగుపొరుగున ఉన్న నలుగురికి, అతని స్నేహితుడొకరికి పాజిటివ్‌ అని తేలింది. ఇప్పుడు వీరి కుటుంబాలు, వీరి సెకండరీ కాంటాక్టులు ప్రమాదంలో పడ్డారు. 

ఇక శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ మర్కజ్‌ జమాత్‌ సమావేశాలకు వెళ్లిన 13 మందిలో మార్చి 17న ఆరుగురు, 18న ముగ్గురు విమానంలో తిరుపతికి వచ్చి శ్రీకాళహస్తి చేరుకున్నారు. 19న నలుగురు రైలులో గూడూరు మీదుగా శ్రీకాళహస్తి చేరుకున్నారు. 

కేంద్ర నిఘా విభాగం మార్చి 29న హెచ్చరించే దాకా వీరిని జిల్లా యంత్రాంగం గుర్తించలేకపోయింది. అప్పుడు హడావిడిగా 30,31 తేదీలలో వీరినీ, కొంతమంది బంధువులనూ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. 

అయితే రిజర్వేషన్‌ లేకుండా ఢిల్లీ నుంచి వచ్చిన వారి గురించిన సమాచారం లేకపోవడంతో వారు పట్టణంలో ఇళ్లలోనే గడిపేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఒక వ్యక్తినీ, అతని భార్యనూ క్వారంటైన్‌కు తరలించిన అధికారులు వీరి ఇద్దరు కొడుకులను పట్టించుకోలేదు. 

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్‌ చేసిన అధికారులు అతడి అన్న కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. వారు ఇంట్లోనే ఉంటూ సాధారణ జీవితం గడిపారు. ఈ నెల 21న అతడి అన్నకు, అన్న కుమార్తెకు వైరస్‌ సోకినట్టు తేలింది.

మరో ‘ఢిల్లీ వ్యక్తి’ పొరుగింట్లో ఉన్న మహిళకు కూడా అదే తేదీన పాజిటివ్‌గా తేలింది. ఇంకో ఢిల్లీ వ్యక్తి ఇంట్లోనే అద్దెకున్న ప్రభుత్వాస్పత్రి మహిళా ఉద్యోగి ఒకరు వైరస్‌ బారిపడినట్లు ఈ నెల 23న వెల్లడైంది. 

క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న వారు వ్యవహరించిన తీరు కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమైంది.  ఈ కేంద్రాల్లో విడివిడిగా ఉండకుండా ఒకే గదిలో వారంతా కలిసి గడిపారు.