‘మహాకూటమి’ విఫలమైన ఆలోచన : జైట్లీ

‘మహాకూటమి’ అన్నది ఎన్నోసార్లు ప్రయత్నించి, పరీక్షించి, విఫలమైన ఆలోచనఅని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మరో కూటమి ఏర్పడితే 2019 ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం, అరాచక కూటమి మధ్యే పోటీ ఉంటుందన్నారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో ఇలాంటి సంకీర్ణాలకు అవకాశమిచ్చేందుకు దేశం సిద్ధంగా లేదన్నారు.

‘హిందూస్థాన్‌ టైమ్స్‌’ నిర్వహించిన నాయకత్వ సదస్సులో జైట్లీ మాట్లాడారు. ‘‘గతంలో చంద్రశేఖర్‌, వీపీ సింగ్‌, చరణ్‌సింగ్‌, ఐకే గుజ్రాల్‌, దేవెగౌడల నేతృత్వంలో మహా కూటములు అధికారంలోకి వచ్చాయి. కొన్ని నెలల్లోనే కుప్పకూలిపోయాయి. స్థిరత్వం, పద్ధతి లేకుండా నడిచే ఇలాంటి ప్రభుత్వాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రస్తుతం అభివృద్ధి మందగించిన దిశలో ప్రపంచం పయనిస్తుంటే... భారత్‌ మాత్రం అభివృద్థి పథంలో దూసుకెళ్తోంది.

మోదీ ప్రభుత్వ హయాంలో బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగిపోతున్నాయని కొందరు అంటున్నారు. వీటిని అర్థంచేసుకోవడానికి వారు (రాహుల్‌గాంధీ) ఇంకా ఎదగాలి. 2007-08లో బ్యాంకులిచ్చిన మొత్తం రుణాలు రూ.18 లక్షల కోట్లు ఉండేవి. 2014 నాటికి ఇవి రూ.55 లక్షల కోట్లకు చేరాయి. ఏటికేడు అప్పటి యూపీఏ ప్రభుత్వం రుణాల మంజూరును 31%పెంచాలని బ్యాంకులపై ఒత్తిడి తెచ్చింది. అనర్హులకు, స్థిరత్వం లేని ప్రాజెక్టులకు రుణాలు కట్టబెట్టారు. బ్యాంకు దోపిడీలకు బీజం పడింది ఆనాడే’’ అని జైట్లీ అన్నారు.

స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీంకోర్టు తీర్పు మంచిదేగానీ, ఇది భావస్వేచ్ఛలో భాగమని పేర్కొనడంతో మాత్రం తాను ఏకీభవించనని జైట్లీ అన్నారు. పాఠశాల వసతి గృహాలు, జైళ్లు, సైనిక శిబిరాల్లో స్వలింగ, ద్విలింగ సంపర్క ఘటనలు చోటుచేసుకుంటే, వాటినెలా నియంత్రించగలమని ఆయన ప్రశ్నించారు.

వివాహేతర సంబంధం నేరం కాదంటే... భారతీయ కుటుంబవ్యవస్థ పశ్చిమదేశాల వ్యవస్థలా మారిపోయే ప్రమాదముందన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించడం అనేక సామాజిక పరిణామాలకు దారితీయవచ్చన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ, టీవీల్లోనూ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన పెట్రోలు ధరలు తగ్గవంటూ రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేంద్రమంత్రి జైట్లీ వ్యంగ్యాస్త్రం సంధించారు.