డీయంకే అధ్యక్ష పదవికి అళిగిరి రగడ !

తండ్రి కరుణానిధి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి మౌనంగా ఉంటూ, తమ్ముడు స్టాలిన్, ఇతర కుటుంభం సభ్యులతో సఖ్యతగా ఉంటున్నట్లు కనిపించిన మాజీ కేంద్ర మంత్రి యంకె అళగిరి కరుణానిధి వారసుడిని ఎన్నుకోవడానికి డీయంకే కార్యవర్గం మంగళవారం సమావేశం అవుతున్న తరుణంలో తిరిగి పార్టీ నాయకత్వం కోసం రగడ ప్రారంభించారు. 2014 ఎన్నికల ముందు పార్టీ నుండి తండ్రి బహిష్కరించడంతో దూరంగా మధురైలో ఉంటూ, అప్పుడప్పుడు వివాదాస్పద వాఖ్యలు చేయడం మినహా మౌనంగా ఉంటూ వస్తున్న ఆయన ఇప్పుడు అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నారు.

 

పార్టీ అధ్యక్ష పదవికి తానే అర్హుడనని అంటూ చెన్నైలోని మెరీనా బీచ్‌లో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం స్పష్టం చేశారు.  పార్టీ క్యాడర్‌ మద్దతు తనకే ఉందని చెప్పుకొచ్చారు. ‘నా తండ్రి నిజమైన సన్నిహితులంతా నా వైపే ఉన్నారు. తమిళనాడులో పార్టీ మద్దతుదారులంతా నాతోనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది అదే. జరుగుతున్న పరిణామాల పట్ల నేను ఎంతో బాధపడ్డాను’ అని పేర్కొన్నారు.

‘స్టాలిన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.. కానీ వర్క్‌ చేయడం లేద’ని అంటూ తమ్ముడిపై విసుర్లు విసిరారు. స్టాలిన్‌ పార్టీ నడుపుతున్న తీరు పట్ల తనకు ఏమాత్రం సంతోషం లేదని ధ్వజమెత్తారు. పార్టీలో కీలక పాత్ర పోషించాలని తనను తమిళ ప్రజలు ప్రోత్సహిస్తున్నారని అంటూ పార్టీ అధ్యక్ష పోటీలో తాను కూడా ఉన్నానని ఆయన చెప్పకనే చెప్పారు. తిరిగి అన్నను పార్టీలోకి తీసుకొచ్చి, కుటుంభం సభ్యులు అందరూ కలసి ఉన్నారనే సంకేతం ఇవ్వాలని భావిస్తున్న స్టాలిన్ కు ఆలిగిరి తాజా వాఖ్యలు ఒకింత షాక్ కలిగిస్తున్నాయి.