లాక్‌డౌన్‌ లేకుంటే లక్ష కేసులు

దేశంలో లాక్‌డౌన్‌ విధించకపోయినైట్లెతే ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైరస్‌ కట్టడికి చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మొదటి సాధికారిక బృందం చైర్మన్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. గతవారం 7.5 రోజుల్లో కేసులురెట్టింపు కాగా ప్రస్తుతం పది రోజులకు చేరిందని పేర్కొన్నారు. 

మరోవైపు నిఘా విధానం ఫలిస్తున్నదని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం డైరెక్టర్‌ ఎక్‌కే సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం 9.45 లక్షల మంది కరోనా అనుమానితులపై నిఘా ఉంచామని, వైరస్‌ లక్షణాలున్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

గత 28 రోజుల్లో సుమారు 15 జిల్లాల్లో కొత్త కేసు ఒక్కటైనా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్ స్పష్టం చేశారు. గత 14 రోజుల్లో దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని చెప్పారు.  

కాగా, కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌ , తమిళనాడులోని చెన్నై, తెలంగాణలోని హైదరాబాద్‌లో వైరస్‌ వ్యాప్తి పరిస్థితి తీవ్రంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఐదు కేంద్ర బృందాలు ఈ నగరాలకు వెళ్లినట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ వెల్లడించారు. 

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లఘింస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటివి ప్రజారోగ్యానికి ముప్పుగా మారవచ్చని ఆమె హెచ్చరించారు.మరోవైపు సాయుధ దళాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. శుక్రవారం సైన్యం సన్నద్ధతపై సమీక్షించిన ఆయన, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. 

దేశంలో కరోనా కేసుల నమోదులో శుక్రవారం తీవ్రస్థాయికి చేరింది. గత 24 గంటల్లో 1,752 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 23,452కు చేరింది. 37 కొత్త మరణాలు నమోదుకాగా ఈ సంఖ్య 723కు పెరిగినట్లు కేంద్రం పేర్కొంది.

మరోవైపు కోలుకున్నవారి సంఖ్యలోనూ శుక్రవారం కొత్త రికార్డు నమోదైంది. మొత్తం 4,748 మంది కోలుకున్నట్లు తెలిపింది. క్రీయాశీలక కేసులతో పోల్చితే కోలుకున్నవారు 20.57 శాతం ఉన్నట్లు పేర్కొంది.