ధాన్యం కొనుగోలకు బండి సంజయ్ దీక్ష 

ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా రాష్ట్రంలో బీజేపీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యక్తంగా తమ, తమ ఇళ్లల్లో ఒకరోజు నిరసన  దీక్ష జరిపారు. 

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు బీజేపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సంజయ్ కుమార్ వారికి భరోసా ఇచ్చారు.  ఈ విషయమై రాష్ట్ర మంత్రులు చేస్తున్న వాఖ్యలు రైహతులను కించపరిచే విధంగా ఉంటున్నట్లు ఆయన విమర్శించారు. 

పంటను కేంద్రమే కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని? ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఆరేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ క్వారంటైన్‌లో ఉన్నారని దుయ్యబట్టారు. క్వారంటైన్‌ అనుభవాలను తెలుసుకోవటానికే ప్రధాని కేసీఆర్‌కు ఫోన్ చేశారేమో? అంటూ ఎద్దేవా చేశారు. 

హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్రకార్యలయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఈ దీక్షను సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరిపారు. 

ఆయనతో పాటు మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, డా. విజయ రామారావు,  ఇ.పెద్దిరెడ్డి,బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్ రావు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  జి ప్రేమేందర్ రెడ్డి, డా. జి మనోహర్ రెడ్డి, మంత్రి  శ్రీనివాసులు తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. 

రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్, ఎమ్యెల్సీ ఎన్. రామచందర్ రావు తమ తమ నివాసాలవద్ద నివాసంలో రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్షలో పాల్గొన్నారు.