తమిళనాడులో ఐదు నగరాలలో పూర్తిస్థాయి లాక్ డౌన్ 

తమిళనాడులోని ఐదు నగరాల్లో మూడు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న చెన్నై, మధురై, కోయంబత్తూర్‌, తిరుపూర్‌, సేలమ్‌లలో ఏప్రిల్‌ 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తామని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. 

ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి కే పళనిస్వామి సూచించారు.  ఆదివారం (ఏప్రిల్‌ 26) ఉదయం 6 గంటల నుంచి బుధవారం (ఏప్రిల్‌ 28) రాత్రి 9 గంటల వరకు చెన్నై, మధురై, కోయంబత్తూర్‌లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, తిరుపూర్‌, సేలంలలో ఆదివారం నుంచి మంగళవారం వరకు రెండురోజులపాటు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. 

తమిళనాడులో ఇప్పటివరకు 1,600 కరోనా కేసులు నమోదుకాగా, 20 మంది మరణించారు. అయితే ఒక్క చెన్నై నగరంలోనే 400 కేసులు నమోదవగా, కోయంబత్తూర్‌లో 134, తిరుపూర్‌లో 110 కరోనా కేసులు రికార్డయ్యాయి. 

 భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి శాతం 20.37కు చేరింది. గత 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అగర్వాల్ చెప్పారు. గత 14 రోజుల్లో 80 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు.